
మన దేశంలో కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా వితంతువుల విషయంలో.. భర్త చనిపోయిన స్ట్రీలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదన్న ఆచారం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు యువత మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమ ఒంటరి తల్లులకు మళ్లీ పెళ్లి చేసి వారికొక కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు స్వయంగా వరుడిని చూసి తమ ఒంటరి తల్లులకు పెళ్లిళ్లు చేసిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఒక ప్రముఖ నటుడు కూడా తన తల్లికి మళ్లీ పెళ్లి చేసి వార్తల్లో నిలిచాడు. మరాఠీ సినిమా ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ్ చందేకర్ తన తల్లికి రెండో వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. అలాగే తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యాడు. ‘ హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మా. నీకు కూడా ఒక జీవిత భాగస్వామి అవసరమని, నీ పిల్లలను మించిన జీవితం నీకు ఉందని, నీకు కూడా నీకోసమే ప్రపంచం ఉండాలని నేనెప్పుడూ గ్రహించలేదు. ఎంతకాలం ఒంటరిగా ఉంటావు. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకంటూ ఒక అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు మీ జీవితం గురించి, ముఖ్యంగా మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. ఇంతకు ముందు మీరు నా వివాహాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశాను.నా జీవితంలో అత్యంత అందమైన పెళ్లి మా అమ్మదే. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అమ్మా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మరాఠీ హీరో.
ఇక సిద్ధార్థ్ భార్య మితాలీ మాయేకర్ కూడా తన అత్తగారి రెండో పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ‘ అత్తగారూ.. మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా సాగాలి. మీరు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. మీరు దృఢంగా ఉండండి. ఈ అద్భుతమైన కుటుంబంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు మీరు మా కోసం చాలా చేశారు. కానీ ఇప్పుడు మీ కోసం జీవించాల్సిన సమయం వచ్చింది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి’ తన అత్తమ్మకు విషెస్ చెప్పింది. సిద్ధార్థ్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చాలా మంచి పనిచేశావ్. నువ్వు రియల్ హీరో. మీరు చాలా మందికి ఆదర్శం’ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా మరాఠీలో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జెండా, క్లాస్‌మేట్స్, బాలగంధర్వ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే మధుర దేశ్‌పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్‌తో కలిసి ‘జీవ్లగా’ ఒక షోలో కూడా కనిపించి అలరించాడు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ అనే వెబ్ సిరీస్‌తో అలరించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..