
వర్సటైల్ హీరో అడవి శేష్(Adivi Sesh) తాజాగా మేజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్న శేష్. తాజాగా 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్(Major) సినిమా చేసి హిట్ అందుకున్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. తాజాగా ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మేజర్ మేకర్స్ అనురాగ్, శరత్ మాట్లాడుతూ.. మేం గూఢచారి సినిమా ప్రీమియర్ చూశాక తిరిగి ఆఫీసుకు వచ్చాం. చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. క్షణం, గూఢచారి చూస్తుంటే శేష్ కష్టం కనిపించింది. దాంతో తర్వాత ఏం చేయబోతున్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటి? అని శేష్ ని అడిగాం. అప్పుడు తను చెప్పింది ఒక్కటే.. యు.ఎస్.లో వున్నప్పుడు 26/11 తాజ్ ఎటాక్ చూశాను. మైండ్‌లో అలా వుండిపోయింది. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ చేయాలనుందని చెప్పాడు. మేం మార్కెటింగ్ చేసే క్రమంలో నమ్రతగారితో పరిచయం ఉంది. ఆ సమయంలో జీఏంబీ లో మంచి క్వాలిటీ సినిమాలు చేయాలని వుందని అన్నారు. అప్పుడు ఆమెకు విషయం చెప్పి శేష్‌ను కూడా మా ఆఫీసుకు రమ్మని నమ్రతగారితో మేజర్ గురించి చర్చించాం. నమ్రతగారికి బాగా నచ్చింది అన్నారు. గౌరవ ప్రదమైన సినిమా చేశాం. దేశమంతా మంచి పేరు వచ్చింది. చాలా గర్వంగా వుంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు వున్నారంటేనే సక్సెస్ అయినట్లు లెక్క అన్నారు. 26/11 కథను మేం తీయలేదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను తీశాం. ఆయన లైఫ్ లో.. 26/11 అనేది ఓ భాగం మాత్రమే. ఈ సినిమా చూశాక యూత్ నుంచి వందకుపైగా ట్వీట్‌లు, మెసేజ్‌లు వచ్చాయి. మేము ఆర్మీలో జాయిన్ అవుతాం. ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయామా! అంటూ పోస్ట్‌లు వచ్చాయి. యూత్ అంతా యు.ఎస్.లో జాబ్‌లు, డాక్టర్, ఇంజనీర్లు అవ్వాలనుకుంటారు. కానీ ఆర్మీ గురించి ఆలోచిస్తున్నారంటే మేం ఎచీవ్‌మెంట్ సాధించాం అనిపించింది అన్నారు.