తమిళ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటిస్తోన్న కోబ్రా చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మద్రాసు హైకోర్టు పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టింది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. భారీ బడ్జెట్తో కొన్నేళ్లుగా ఎన్నో అంచనాల మధ్య రూపొందించిన సినిమాను పైరసీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని… పలు ప్రైవేట్ వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోబ్రా చిత్ర నిర్మాణ సంస్థ సెవన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన నిర్మాత లలిత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమంక్షయంలో సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. చట్టవిరుద్ధంగా సినిమా ప్రదర్శించకుండా నిరొందించడానికి 1,788 పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాతలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి.. ఎదురైన ప్రతి అడ్డంకులను ఎదుర్కొని సినిమా విడుదల చేస్తుంటే.. పలు వెబ్ సైట్స్ మాత్రం పైరసీ చేస్తున్నాయని.. దీంతో ప్రొడ్యూసర్లకు భారీగా నష్టం ఏర్పడుతుందని.. అంతేకాకుండా ఎంతో మంది సినీ కార్మికుల జీవితాలు నాశం అవుతున్నాయని పిటిషన్ లో పేర్కోన్నారు. ఎన్నో నెలలు కష్టపడి తెరకెక్కించిన కోబ్రా చిత్రాన్ని పైరసీ చేయకుండా పలు వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అనంతరం పైరసీకి పాల్పడుతున్న వెబ్ సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు.