Maa Nanna Superhero Movie Review: ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా రివ్యూ.. సుధీర్ బాబు హిట్టు కొట్టాడా..?

| Edited By: Rajitha Chanti

Oct 11, 2024 | 12:16 PM

మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా ప్రతీసారి కొత్త కథలు చేయడానికి ప్రయత్నించే హీరో సుధీర్ బాబు. తాజాగా ఈయన మా నాన్న సూపర్ హీరో అంటూ వచ్చాడు. అభిలాష్ కంకర తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తి ఎమోషనల్ రోలర్ కోస్టర్‌గా వచ్చింది. మరి ఆడియన్స్ కూడా ఈ సినిమాతో అంతే ప్రేమలో పడతారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Maa Nanna Superhero Movie Review: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ.. సుధీర్ బాబు హిట్టు కొట్టాడా..?
Maa Nanna Superhero
Follow us on

మూవీ రివ్యూ: మా నాన్న సూపర్ హీరో

నటీనటులు: సుధీర్ బాబు, ఆర్ణా, షాయాజీ షిండే, సాయిచంద్ త్రిపురనేని, విష్ణు, శశాంక్ తదితరులు

సంగీతం: జై క్రిష్

సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి

ఎడిటర్: అనిల్ కుమార్ పి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అభిలాష్ రెడ్డి కంకర

నిర్మాతలు: సునీల్ బలుసు

మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా ప్రతీసారి కొత్త కథలు చేయడానికి ప్రయత్నించే హీరో సుధీర్ బాబు. తాజాగా ఈయన మా నాన్న సూపర్ హీరో అంటూ వచ్చాడు. అభిలాష్ కంకర తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తి ఎమోషనల్ రోలర్ కోస్టర్‌గా వచ్చింది. మరి ఆడియన్స్ కూడా ఈ సినిమాతో అంతే ప్రేమలో పడతారా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

పుట్టగానే తల్లిని కోల్పోతాడు జానీ (సుధీర్ బాబు). అతడి తండ్రి ప్ర‌కాష్ (సాయిచంద్‌) లారీ డ్రైవర్. కొడుకు కోసం డబ్బులు సంపాదించాలని ఓ లోడ్ తీసుకుని వెళ్తాడు. అందులో కూరగాయలు ఉన్నాయని చెప్తారు. తను వచ్చే వరకు బాబును చూసుకోమని అనాధాశ్రమంలో వదిలి వెళ్తాడు ప్రకాశ్. అలా లోడ్ తీసుకుని వెళ్లిన ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.. దానికి కారణం ఆ లారీలో గంజాయి ఉండటమే. దాంతో 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. దాంతో ఆ పిల్లాడు అనాథ అవుతాడు. అతడికి జానీ అని పేరు పెట్టి పెంచుతారు. అప్పుడే పిల్లలు లేని బిజినెస్ మెన్ అయిన శ్రీ‌నివాస్‌ (షాయాజీషిండే), అతడి భార్య(ఆమని)ను ఒప్పించి జానీని ద‌త్త‌త తీసుకొంటాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోతాడు ప్రకాశ్. ఇదంతా జాతి జాతకం లేని ఆ పిల్లాడి వల్లే అని అంతా చెప్పడంతో.. కొడుకును దూరం పెడుతుంటాడు. కానీ తండ్రి అంటే చచ్చేంత ప్రేమ పెంచుకుంటాడు జానీ. తన జీవితంలో తండ్రి కంటే ఏదీ ఎక్కువ కాదంటాడు. మరోవైపు శ్రీనివాస్ షేర్ మార్కెట్స్‌లో డబ్బులు పెట్టమని అందరికీ చెప్తుంటాడు. అలా ఓసారి శ్రీనివాస్ చెప్పింది నమ్మి ఓ పొలిటికల్ లీడర్ కోటి రూపాయలు నష్టపోతాడు. దాంతో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయించి.. పోలీసులతో చితక్కొట్టిస్తాడు ఆ లీడర్. నీ తండ్రి కావాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అంటాడు లీడర్. అదే సమయంలో జానీ అసలు తండ్రి ప్రకాశ్ జైలు నుంచి విడుదలై కొడుకు కోసం చూస్తుంటాడు. అప్పుడేమైంది.. తండ్రీ కొడుకులు కలిసారా.. పెంచిన తండ్రిని విడిపించాడా లేదా అనేది అసలు కథ..

కథనం:

మాస్ సినిమాలో కథ కాస్త అటూ ఇటూగా ఉన్నా సర్దుకోవచ్చు కానీ.. ఎమోషనల్ సినిమాల్లో కథకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని తెరకెక్కించే విధానం కూడా అంతే అద్భుతంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి మిస్సైనా సినిమా మిస్ ఫైర్ అవుతుంది. మా నాన్న సూపర్ హీరో విషయంలో జరిగింది ఇదే. నిజం చెప్పాలంటే సుధీర్ బాబు చాలా మంచి కథ ట్రై చేసాడు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అవుతుందనుకున్నాడేమో కానీ కాలేదు. ఓ కొడుకు.. ఇద్దరు తండ్రుల కథ ఇది.. దీన్ని ఇంకాస్త ఎమోషనల్‌గానూ చెప్పొచ్చు కానీ అదే మిస్సైంది సినిమాలో. 20 ఏళ్ళ తర్వాత తండ్రీ కొడుకు కలిసే మూవెంట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా చూస్తుంటారు. అలాగే కొడుకును తండ్రి ఎలా కలుస్తాడు.. ఎక్కడ కలుస్తాడు అనే సీన్స్ కూడా ఎమోషనల్‌గా చెప్పొచ్చేమో అనిపించింది. ఆ ఇద్దరూ కలుస్తున్నపుడు అంత ఫీల్ అనిపించదు.. మరోవైపు పెంచిన తండ్రితో వచ్చే సీన్స్ కూడా ఎమోషనల్ సైడ్ కంటే.. ఎక్కువగా ఫైటింగ్ చేసుకున్నట్లే అనిపిస్తుంది. ఫస్టాఫ్ వరకు అక్కడక్కడా మంచి సీన్స్ పడ్డాయి.. కానీ సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పింది. కథ ఎటు పోతుందో కూడా అర్థం కాదు.. క్లైమాక్స్‌లో మంచి సీన్స్ పడినా అప్పటికే చేదాటిపోతుంది. మా నాన్న సూపర్ హీరోలో ఎమోషనల్ మూవెంట్స్ ఉన్నా.. అవి సినిమాకు హెల్ప్ అవ్వలేదు. సెకండాఫ్ మొదటి 45 నిమిషాలు నిజమైన తండ్రీ కొడుకుల జర్నీ ఉంటుంది. అయితే అందులో ఎమోషన్ కంటే కూడా జస్ట్ రైడ్ మాదిరే చూపించాడు దర్శకుడు. మధ్యలో రాజు సుందరం ఎపిసోడ్ కథకు అడ్డు తగిలినట్లే. అక్కడ వచ్చే కేరళ వెడ్డింగ్ సాంగ్ కూడా. అదంతా కథను ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ల్యాగ్ చేయడానికే అనిపించింది.

నటీనటులు:

సుధీర్ బాబు చాలా బాగా నటించాడు.. ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా చేసాడు. షాయాజీ షిండే నటన బాగుంది. ఫిదా ఫేమ్ సాయిచంద్‌కు చాలా మంచి పాత్ర పడింది.. దాన్ని బాగా చేసాడు కూడా. హీరోయిన్ ఆర్ణా చాలా చిన్న పాత్ర చేసింది. ఉన్నంతలో ఓకే. అలాగే హీరో ఫ్రెండ్‌గా విష్ణు బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

మా నాన్న సూపర్ హీరోకు మంచి సంగీతమే ఇచ్చాడు జై క్రిష్. ఓ ఫీల్ ఉంది.. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ చాలా క్రిస్పీగా పని చేసాడు. కేవలం 2 గంటల 7 నిమిషాలు మాత్రమే నిడివి ఉంటుంది. దర్శకుడు అభిలాష్ కంకర ఓ నవలలా చెప్పాలనుకున్నాడు ఈ కథను. అందులో సగమే సక్సెస్ అయ్యాడు.. ఎమోషన్స్ ఉన్నాయి కానీ అంతగా వర్కవుట్ కాలేదనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మా నాన్న సూపర్ హీరో.. అక్కడక్కడా వర్కవుట్ అయిన ఎమోషన్స్..!