AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రివ్యూ చూసి సినిమా ఆడదు అన్నారు.. డైరెక్టర్ బోరున ఏడ్చాడు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాస్టార్ మూవీ

దర్శకుడు కొదండరామిరెడ్డి, నిర్మాత కే.ఎస్. రామారావుల కలయిక తెలుగు చిత్రసీమకు ఎన్నో అద్భుతాలను అందించింది. చిరంజీవితో చేసిన ఓ సినిమా విడుదలకు ముందు కొదండరామిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట. ప్రివ్యూ చూసి సినిమా ఆడదు అన్నారట.. సాంగ్స్ తప్ప సినిమాలో ఏం బాలేదు అన్నారు.

ప్రివ్యూ చూసి సినిమా ఆడదు అన్నారు.. డైరెక్టర్ బోరున ఏడ్చాడు.. కట్ చేస్తే  బ్లాక్ బస్టర్ కొట్టిన మెగాస్టార్ మూవీ
Movie
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2026 | 8:00 AM

Share

సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటిలో నిర్మాత కే.ఎస్. రామారావు, దర్శకుడు కొదండరామిరెడ్డిల కలయిక ఒకటి. ఈ ద్వయం మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించింది. వారి ప్రయాణం విజయాలతో నిండి ఉన్నప్పటికీ, కొన్ని భావోద్వేగ ఘట్టాలు కూడా ఉన్నాయి. కే.ఎస్. రామారావు “క్రియేటివ్ కమర్షియల్స్” బ్యానర్ ద్వారా తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్ చేస్తూ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇళయరాజా సంగీతానికి అభిమానిగా మారిన ఆయన, తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా తీయాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. మరోవైపు, కొదండరామిరెడ్డి బి. విఠలాచార్య, కే. రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆ తర్వాత “న్యాయం కావాలి” సినిమాతో దర్శకుడిగా మారారు. చిరంజీవితో “కిరాయి రౌడీలు”, “ప్రేమ పిచ్చోళ్లు” వంటి చిత్రాలను డైరెక్ట్ చేసి, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర నటులతోనూ సినిమాలు చేస్తూ తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన ఒకే సమయంలో ఈ నలుగురు స్టార్ హీరోలతో పనిచేయగల సామర్థ్యం కే.ఎస్. రామారావుకు నమ్మకాన్ని కలిగించింది.

కే.ఎస్. రామారావుకు చిరంజీవి హీరోగా, కొదండరామిరెడ్డి దర్శకత్వంలో, ఇళయరాజా సంగీత సారథ్యంలో, యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా సినిమాలు తీయాలనే స్పష్టమైన ప్రణాళిక ఉండేది. ఈ ఆలోచన నుంచి మొదటి సినిమాగా “అభిలాష” రూపుదిద్దుకుంది. యండమూరి వీరేంద్రనాథ్‌ను కొదండరామిరెడ్డి వద్దకు తీసుకెళ్లి నవల చదవమని కే.ఎస్. రామారావు కోరారు. నవల సారాంశాన్ని విని సినిమా తీయడానికి కొదండరామిరెడ్డి అంగీకరించారు. ఆ నవల కొదండరామిరెడ్డి భార్య భారతికి కూడా బాగా నచ్చడంతో, ఈ కథను వదులుకోవద్దని ఆమె సూచించారు.

“అభిలాష” చిత్రీకరణ పూర్తయ్యాక చెన్నైలో ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ చూసిన తర్వాత సినిమా ప్రేక్షకులకు అర్థం కాలేదని, కేవలం పాటలు మాత్రమే ఉన్నాయని, ఫలితం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని కొదండరామిరెడ్డికి అనిపించింది. ఈ వార్త విని ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద కూర్చుని వలవలా ఏడ్చారట. ఆ సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ ఆయనను ఓదార్చి, “ఇది కొత్త ప్రయోగం, సినిమా కచ్చితంగా నచ్చుతుంది” అని ధైర్యం చెప్పారు. వీరేంద్రనాథ్ మాటలు నిజమయ్యాయి. “అభిలాష” తెలుగు సినిమాకు ఒక సరికొత్త ఊపును తెచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతం, కొత్త ధ్వని ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాయి. “అభిలాష” తర్వాత, ఈ కాంబినేషన్ “ఛాలెంజ్”, “రాక్షసుడు”, “మరణమృదంగం” వంటి వరుస విజయాలను సాధించింది. “ఛాలెంజ్” సినిమా తనకు అత్యంత ఇష్టమైనదని, షూటింగ్‌కు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురుచూసిన చిత్రమని కొదండరామిరెడ్డి స్వయంగా చెప్పేవారు. “రాక్షసుడు” నవలను రెండు భాగాలుగా ఉన్నప్పటికీ, ఫ్లాష్‌బ్యాక్ టెక్నిక్‌తో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడిగా కొదండరామిరెడ్డి స్క్రిప్ట్‌లోని అనవసర అంశాలను తొలగించి, కథకు బలాన్ని చేకూర్చే సన్నివేశాలపైనే పూర్తి ఏకాగ్రత చూపేవారు. హీరో, హీరోయిన్లకే కాకుండా గ్రూప్ డాన్సర్లకు కూడా పాటల్లో మూడు డ్రెస్ చేంజ్‌లు ఉండేలా చూసేవారు, ఇది ప్రేక్షకుల కనుల పండుగగా ఉండేది. కే.ఎస్. రామారావు, కొదండరామిరెడ్డి కలయికలో మొత్తం 23 చిత్రాలు తెరకెక్కగా, అందులో 18 సూపర్ హిట్‌లుగా నిలిచాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us