Tollywood : సినిమా థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించడంపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ విధానం, టికెట్ ధరలపై కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్, నిన్న హీరో నాని విమర్శలు గుప్పించారు. నాని మాట్లాడుతూ కిరాణా కొట్టు కలెక్షన్స్ థియేటర్ కలెక్షన్స్ కంటే ఎక్కువవుంటున్నాయ్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. టికెట్ ధరల తగ్గింపుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, హీరోలే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే చాలు అని మంత్రి అన్నారు. అలాగే హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటేసినిమా ఖర్చు తగ్గిపోతుందని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. అంతేగాక, పవన్ కళ్యాణ్ సినిమాలకు అవుతున్న ఖర్చెంత? ఆయన రెమ్యూనరేషన్ ఎంత అని ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉంటే అసలు తెలుగు సినిమా బడ్జెట్‌లో హీరోల పారితోషకం ఎంత అన్నది ఒక్కసారి చూద్దాం..
టాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ లెవల్‌లో ఉన్న హీరోల్లో ప్రభాస్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు తరువాత స్థానాల్లో చిరంజీవి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త మూవీ ‘స్పిరిట్’ కి 120-150 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నాడని ఇప్పుడు ఫిలింనగర్ లో చర్చ జరుగుతుంది. 8 భాషల్లో నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లని, అందులో సగం హీరో రెమ్యూనరేషనే ఉందనే ఇప్పుడు హాట్ టాపిక్. బాహుబలి తర్వాత టాలీవుడ్ స్థాయి అమాంతం పెరిగింది. మన సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. ఆల్ ఇండియా బాక్సాఫీస్‌ని కొల్లగొడుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.. కానీ ఇప్పుడు మన సినిమాలే అక్కడ రీమేకై.. భారీ వసూళ్లని రాబడుతున్నాయి. మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్థాయి పెరగడంతో హీరోల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది.
కానీ, ఒక్కో సినిమాకు హీరోలు ఎంత తీసుకుంటారనేది అఫిషియల్‌గా ఎక్కడ ప్రకటించలేదు. కానీ వారి సినిమా స్థాయి, బడ్జెట్, వసూలు చేసిన కలెక్షన్లను బట్టి హీరోల డిమాండ్ ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం.. తెలుగు టాప్ హీరోల పారితోషకాలు ఇలా ఉన్నాయి.. ప్రభాస్ – 80-100 కోట్లు, పవన్ కళ్యాణ్ – 50-60 కోట్లు, మహేష్‌బాబు – 50-60 కోట్లు, చిరంజీవి – 40-50 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ – 30-40 కోట్లు, రామ్‌చరణ్ – 30-40 కోట్లు, అల్లు అర్జున్ – 25-35 కోట్లు, బాలకృష్ణ – 10-12 కోట్లు, నాని – 10-12 కోట్లు, విజయ్ దేవరకొండ – 10-12 కోట్లు, అలాగే రవితేజ 10-15 కోట్లు, రామ్ 10-12 కోట్లు, వెంకటేష్, నాగార్జున 5-8 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్ . ఎంత గొప్ప సినిమా అయినా ఓపెనింగ్ కలెక్షన్ల విషయంలో స్టార్ ఇమేజి ఉపయోగపడుతుందనడంలో సందేహంలేదు. మరో వైపు అతి తక్కువ బడ్జెట్‌లో తీయబడి ఏడెనిమిది రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్న సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :