
సినిమా.. రంగు రంగుల గ్లామర్ ప్రపంచం. వెండితెరపై అందం, తమ నటనతో మాయ చేసిన ఎంతోమంది నటీనటుల జీవితాల్లో అనేక చీకటి కోణాలు దాగున్నాయి. ఉదాహారణకు తెరపై నవ్వులు పూయించే నటీనటులు తమ జీవితం మాత్రం బాధ, దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తారలు.. ఇప్పుడు తినడానికి తిండి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పావలా శ్యామల, పాకీజా వంటి నటీమణుల గురించి చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో మాత్రం జీవితంలో ఎన్నో బాధలను మోస్తున్నారు. అతడిని ‘ఎన్నుయిర్ తోజన్ బాబు’ అని తమిళ సినీప్రియులు ముద్దుగా పిలుచుకుంటారు. 1990లో భారతీరాజా దర్శకత్వం వహించిన ‘ఎన్నుయిర్ తోజన్’ చిత్రం ద్వారా బాబు హీరోగా అరంగేట్రం చేశాడు.
ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు బాబు. కానీ అతడి నటనా ప్రతిభను చూసి హీరోగా ఎంపిక చేసుకున్నారు భారతీరాజా. ఈ రాజకీయ చిత్రంలో బాబు పార్టీ కార్యకర్త పాత్రను పోషించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అలాగే ఆయనను జనాలు ఎన్నుయిర్ తోజన్ బాబు అని పిలిచారు. ఆ తర్వాత విక్రమన్ దర్శకత్వం వహించిన పెరుంపుల్లి సినిమాతో హీరోగా మరోసారి సక్సెస్ అయ్యాడు. దీంతో తమిళంలో బాబుకు వరుస అవకాశాలు వచ్చాయి. తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ‘మనసార వత్తుఘంగలెన్’ చిత్రంలో ఒక యాక్షన్ సీన్ కోసం బాబు ఎత్తైన ప్రదేశం నుండి దూకాల్సి వచ్చింది. అందరూ బాబును రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు. స్టంట్ మాన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ బాబు ‘నేను దూకుతాను’ అని చెప్పి దూకాడు. అప్పుడే ఊహించని సంఘటన జరిగింది.
అలా దూకిన సమయంలో అతడు వేరే చోట పడిపోవడంతో అతడి వెన్నెమూక విరిగిపోయింది. దీంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆసుపత్రిలో ఇంటెన్సివ్ చికిత్స పొందిన తర్వాత బాబు లేచి నడవలేకపోయాడు. 30 సంవత్సరాలకు పైగా మంచం మీదనే ఉండిపోయాడు. ఒక్క సినిమాలోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసిన బాబు 2023 సెప్టెంబర్ 19న కన్నుమూశారు.