Sebastian P.C. 524: ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొందరు హీరోలు ఎలివేట్ అవుతుంటారు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్ లేకుండా రాజావారు రాణిగారు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో కిరణ్ అబ్బవరం. ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. టైటిల్‌ని సరికొత్తగా ఎలివేట్ చేస్తూ కిరణ్ నటించిన లేటెస్ట్ సినిమా సెబాస్టియన్. టైటల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలోనూ ఉందా? ట్రైలర్‌లో ఉన్నంత వినోదం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయిందా? చదివేయండి.
చిత్రం: సెబాస్టియన్ పీసీ 524
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కోమలి ప్రసాద్, సువేక్ష, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ, సూర్య తదితరులు
సంగీతం: జిబ్రాన్
కెమెరా: రాజ్ కె.నల్లి
దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
నిర్మాతలు: సిద్ధారెడ్డి.బి., జయచంద్రరెడ్డి, ప్రమోద్, రాజు
కొడుకు పోలీస్ కావాలన్నది సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) తండ్రి కోరిక. ఆ విషయాన్నే చెప్పి పెంచుతుంది తల్లి (రోహిణి). సెబా కూడా అదే లక్ష్యంతో చదువుకుని పోలీస్ అవుతాడు. అయితే చిన్నప్పటి నుంచీ సెబాస్టియన్‌కి రేచీకటి ఉంటుంది. ఆ విషయం దాచి పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. రాత్రి పూట డ్యూటీ పడ్డ ప్రతిసారీ.. ఏదో ఒక తప్పు చేసి ఇరుక్కుని ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. అలా ఒకసారి అతను పుట్టిన ఊరు మదనపల్లికే ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ స్టేషన్ ఇన్‌చార్జి మంచివాడు కావడంతో సెబా ఆటలన్నీ సాగుతాయి. కానీ ఒకరోజు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో సెబా రాత్రిపూట డ్యూటీ చేయాల్సి వస్తుంది. అదే రోజు మదనపల్లిలో నీలిమ (కోమలీ ప్రసాద్) హత్యకు గురవుతుంది. ఆమెను హత్య చేసిందెవరు? ఆమె హత్యతో సెబా ఫ్రెండ్‌కీ, లవర్‌కీ, డాక్టర్‌కీ ఉన్న సంబంధం ఏంటి? నిజమైన హంతకులెవరు? వాళ్లని సెబా ఎలా కనిపెట్టాడు? వంటివన్నీ కథను ముందుకు నడిపించే విషయాలు.
ఉద్యోగం గొప్పదా.. న్యాయం గొప్పదా అంటే.. ఉద్యోగమే గొప్పది అని తన అంతరాత్మ తల్లి రూపంలో వచ్చి చెప్పిన మాట కోసం రెండేళ్లు కష్టపడి నీలిమ కేస్ తేలుస్తాడు సెబా. ఈ సెబా కేరక్టర్‌లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు కిరణ్ అబ్బవరం. ఆయనకు బాగా పరిచయం ఉన్న రాయలసీమ యాసలో మంచి ఫన్ క్రియేట్ చేశారు. రేచీకటి ఉన్న పోలీసుగా సెబా భయపడే తీరు, ఆ భయంలో అతను అనే మాటలు ఫన్ క్రియేట్ చేశాయి. కానీ లైటు వెలుగు ఉన్నా సెబాకి ఎందుకు కనిపించదన్నది చాలా మందికి వచ్చే డౌటు. సినిమాలో మెయిన్ టర్న్ వచ్చిన ప్రతిసారీ నెక్స్ట్ సీన్ వేరే లెవల్లో ఉంటుందనుకున్న ఆడియన్స్ కి నిరాశ ఎదురుకావడం సినిమాకు పెద్ద డ్రాబాక్. ముందే ఊహించదగ్గ కథనం, నిదానంగా సాగే సన్నివేశాలు, ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం, చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూసినట్టు అనిపించడం… ఇలాంటివన్నీ సహనానికి పరీక్ష పెడతాయి.
జిబ్రన్ సంగీతం బావుంది. అనంతపురం పరిసరాల్లో లొకేషన్లు కూడా కొత్తగా అనిపించాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బావుండేది. సువేక్ష స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. కోమలి ప్రసాద్, ఆదర్శ్, సూర్య తమ తమ కేరక్టర్లను బాగా పోషించారు.
(డా . చల్ల భాగ్యలక్ష్మి) ET Tv 9