
“కాశ్మీరు లోయలో.. కన్యాకుమారిలో ఓ చందమామ”.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదొక్కటే కాదు.. ఎన్నో భారతీయ సినిమాలకు కాశ్మీర్ ఒక స్వర్గధామం. స్వర్గాన్ని భూమ్మీదకు దింపారా అన్నంత అందంగా ఉండే కాశ్మీరు లోయలో దశాబ్దాలుగా ఎన్నో సినిమాల చిత్రీకరణ జరిగింది. 90వ దశకం కాశ్మీరీ పండిట్ల ఊచకోత తర్వాత మొదలైన వేర్పాటువాదం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కొన్నాళ్లపాటు స్థానికంగా అస్థిరతకు, అశాంతికి కారణమైంది. అయినప్పటికీ సినిమాల చిత్రీకరణ, యాత్రికుల తాకిడి పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పహల్‌గాంలో.. అందులోనూ ఒక మతానికి చెందినవారే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిని భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. సహజసిద్ధ ప్రకృతి అందాలకు నెలవైన కాశ్మీర్ లోయలో జలజల సెలయేళ్లు పారాల్సిన చోట రక్తపుటేరులు పారించిన ఆ ఉగ్రమూకను భారత బలగాలు అంతం చేయడమే కాదు, ఆ ముష్కరులను పెంచి, పోషించి, మారణాయులతో శిక్షణనిచ్చి మన గడ్డపైకి పంపిన పాకిస్తాన్‌కు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం చెప్పిన గుణపాఠం కూడా చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. పహల్‌గాం ఉగ్రదాడి మిగిల్చిన గాయం నుంచి ఆ ప్రాంతం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పర్యాటకుల తాకిడి మళ్లీ మొదలైంది. భారతసైన్యం నింపిన గుండె ధైర్యంతో పర్యాటకులతో పాటు ఇప్పుడు సినిమా షూటింగులు కూడా మొదలయ్యాయి.
పహల్‌గాం ఉగ్రదాడి తర్వాత కొన్ని నెలల పాటు పర్యాటకులు, సినిమా బృందాలు కాశ్మీరు లోయకు దూరంగా ఉన్నారు. అప్పటి వరకు అటు పర్యాటకులకు.. ఇటు సినిమా యూనిట్లకు కాశ్మీర్ ఒక స్వర్గధామం. హిమాలయ పర్వత శిఖరాల నడుమ విశాలమైన లోయలో విస్తరించిన కాశ్మీర్లో ఎటు చూసినా అందమైన దృశ్యమే కనిపిస్తుంది. చలికాలం వస్తే పూర్తిగా మంచు దుప్పటి కప్పుకుని ఆ అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. వీటికి తోడు ఆ పరమ శివుడి పవిత్ర క్షేత్రం అమర్‌నాథ్ గుహ కూడా కాశ్మీర్‌లోనే కొలువై ఉంది. దీంతో పర్యాటకులే కాదు, తీర్థయాత్రలు చేసే భక్తులు సైతం పెద్ద సంఖ్యలో కాశ్మీర్ లోయకు వస్తుంటారు. అందులోనూ అమర్‌నాథ్ యాత్రకు ప్రవేశమార్గాల్లో పహల్గాం ప్రధానమైనది. సరిగ్గా అక్కడే ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడి యాత్రికులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర చర్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ మరుక్షణం నుంచే యాత్రికులు, సినిమా షూటింగ్‌లు రద్దయిపోయాయి. కాశ్మీర్ లోయ మొత్తం యాత్రికులు లేక వెలవెలబోయింది.
ఆ తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులకు, వారి వెనకాల ఉన్న శక్తులకు తగినరీతిలో బుద్ధి చెప్పింది. మరోవైపు జమ్ము కాశ్మీర్‌లోని స్థానిక ప్రభుత్వం కూడా యాత్రికుల్లో భరోసా నింపే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. మొత్తంగా ఇప్పుడు సాధారణ పరిస్థితులు మెల్లమెల్లగా నెలకొంటున్నాయి. యాత్రికులతో పాటు సినిమా యూనిట్లు సైతం కాశ్మీర్ లోయలోకి అడుగు పెడుతున్నాయి.
తెలుగు సినిమాతోనే పునఃప్రారంభం
ఉగ్రదాడి తర్వాత లోయలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా యూనిట్ కూడా తెలుగు చిత్రసీమదే కావడం విశేషం. డీజే టిల్లు (DJ TILLU) ఫేమ్ విక్రమ్ కృష్ణ దర్శకతంలో చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్న “అనుమాన పక్షి” సినిమా షూటింగ్ పహల్‌గాంలో జరుగుతోంది. ఇందులో రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి అందమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ, కొన్ని సీన్స్ షూటింగ్ జరుగుతుంది. దానికి తగ్గట్టే స్థానిక నటీనటులను కూడా తీసుకుంటారు. ఆ మేరకు స్థానిక క్యాస్టింగ్ డైరక్టర్ ఒమర్ @ ఎస్కే శామ్ పలువురు నటులను అందించారు. దీంతో స్థానిక కశ్మీరీలకు మళ్లీ ఉపాధి ద్వారాలు తెరుచుకున్నట్టయింది.
సినిమా దర్శకుడు విమల్ కృష్ణ టీవీ9 భారత్‌వర్ష్ ప్రతినిధి మెహరాజ్ అహ్మద్‌తో మట్లాడుతూ… “పహల్‌గాం ఘటన తర్వాత కాశ్మీర్‌లో సినిమా షూటింగ్ అంటే తొలుత కాస్త భయం కలిగింది. కానీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అందరూ చాలా ఆత్మీయంగా చూసుకుంటున్నారు. దుర్ఘటన తర్వాత మొదటి సినిమా మాదే. మమ్మల్ని ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు. ఏ ఒక్కరూ కూడా బయటి వ్యక్తిలా చూడలేదు.” అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏర్పాట్లు కూడా బావున్నాయని, తాము సురక్షిత ప్రాంతంలో ఉన్నామన్న భావన కలిగిందని విమల్ కృష్ణ అన్నారు. మొత్తమ్మీద డీజే టిల్లు సినిమా ద్వారా యువతను ఉర్రూతలూగించిన విమల్ కృష్ణ ఇప్పుడు అనుమన పక్షి సినిమా ద్వారా కాశ్మీర్ అందాలను తెరపై చూపించేందుకు సిద్ధమయ్యారు.