గత కొద్ద రోజులుగా నార్త్ వర్సెస్ సౌత్.. హిందీ వర్సెస్ రీజనల్ లాంగ్వేజ్ చిత్రాలు అనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భాష వివాదంలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వార్ జరగ్గా.. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదం స్పందించారు. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను మీడియాతో, సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి బాలీవుడ్ వర్సెస్ సౌత్ చిత్రాలపై కిచ్చా సుదీప్ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల కంటే దక్షిణాది చిత్రాలు సూపర్ హిట్ కావడానికి కేవలం కంటెంట్ మాత్రమే కారణమన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్ రోణ. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ స్థాయి దాదాపు 5 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుదీప్ మాట్లాడుతూ.. “కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడైన సూపర్ హిట్ కాగలవు. ఇది ఎవరో ప్రత్యేకంగా చేయారు. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులే ఆదరిస్తారు. కేవలం ఇది కంటెంట్ విజయం మాత్రమే. హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘మైనే ప్యార్ కియా’, ‘షోలే’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాలు చూస్తూనే ఉన్నాం. బెంగళూరులోని సినిమా హాళ్లలో గుజరాతీ, పంజాబీ కుటుంబాల కథను చూస్తూనే ఉన్నాం. ఇక్కడ సాంస్కృతిక బేధం అనే మాట తలెత్తదు. నువ్వు ఎప్పుడూ చూడని కథ నీ ముందుకు వస్తే తప్పకుండా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ అదే జరుగుతుంది. ”
“ఇప్పుడు సౌత్ సినిమాలు నార్త్ లోని థియేటర్లలో విడుదల అవుతున్నాయి. కానీ ఇంతకు ముందు అలా కాదు. దక్షిణాది చిత్రాలు కేవలం టీవీలలో మాత్రమే వీక్షించేవాళ్లు. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. నేను ఢిల్లీ, గోవా, ముంబై, జైపూర్ లేదా మరేదైనా నగరానికి వెళ్ళినప్పుడు, ప్రజలు నన్ను గుర్తించి, బాజీరావులో నేనే హీరో అనేవారు..ఎందుకంటే నా చిత్రం కెంపే గోడ హిందీలో డబ్ చేయబడి దానికి బాజీరావు అని పేరు పెట్టారు. అప్పుడు ప్రజలు మమ్మల్ని శాటిలైట్ స్టార్స్‌గా మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు నేరుగా నార్త్ లో థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో భాష అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇది చాలా సంతోషం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు విడుదలవుతున్నాయి. 15 సంవత్సరాలలో జరగనివి ఈ రెండేళ్లలో మార్పులు జరిగాయి. ” అంటూ చెప్పుకొచ్చారు.