బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడిచినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.900 కోట్లు దాటేసిన జవాన్ ఈ వారం పూర్తయ్యేలోపు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అట్లీ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో షారుక్ డ్యూయల్ రోల్‌లో సందడి చేశారు. అభిమానులను మెప్పించారు. అందుకే ఆయన సినిమాకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకు జవాన్ సినిమా తెగ నచ్చేసింది. అదే సమయంలో కొందరు మాత్రం షారుక్ సినిమాపై పెదవి విరుస్తున్నారు. తన పాత కమర్షియల్ తరహా సినిమాల్లాగానే అట్లీ జవాన్ తీశారని, కథలో కొత్తదనం లేదని, ఇప్పటికే పాపులర్ అయిన సినిమాల్లోని సీన్లను కలిపి షారుక్ సినిమాను తెరకెక్కించారంటూ విమర్శలు చేస్తున్నారు. కార్తీ నటించిన సర్దార్ కూడా ఇదే కథేనంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై స్పందించారు డైరెక్టర్ అట్లీ. ‘నా సినిమాల్లో ప్లాష్ బ్యాక్ ఉంటుందని, దాదాపు అన్ని సినిమాల్లో అదే ఉంటుందని చాలా మంది విమర్శకులు అంటున్నారు. నేను ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌ని. మాస్ ఎలిమెంట్స్, హీరోయిక్ సీన్స్‌పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. నా సినిమాలు వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటాను. కాబట్టి నేను తరచుగా కమర్షియల్ ఎలిమెంట్స్, హై మాస్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్, చిత్రాలను తెరకెక్కిస్తాను. కాబట్టి కొంతమందికి అలా అనిపించవచ్చు’ అని చెప్పుకొచ్చారు అట్లీ.
ఇక తన సమకాలీన దర్శకులతో తనను పోల్చుకున్న అట్లీ.. ‘పా రంజిత్, లోకేష్ కనగరాజన్, కార్తీక్ సుబ్బరాజు కంటే నేను భిన్నంగా ఆలోచిస్తాను. ఎందుకంటే వారిలో నేనొక్కడినే పూర్తిగా కమర్షియల్ సినిమాలు, వినోదాత్మక చిత్రాలు చేస్తున్నాను. వాళ్లు నా స్నేహితులు. వాళ్ల నమ్మకాలు, ఐడీయాలజీ ప్రకారం సినిమాలు తీస్తున్నారు’ అని పేర్కొన్నారు అట్లీ. కాగా ‘రాజా రాణి’ సినిమాతో డైరెక్టర్‌గా అట్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాఅద్భుతంగా ఆడింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత హీరోయిజం, మాస్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు అట్లీ. విజయ్‌తో ‘తెరి’, ‘మర్సెల్’, ‘బిగిల్’ వంటి సినిమాలు పక్కా కమర్షియల్ సినిమాలు చేశాడు. ఇప్పుడు షారుక్‌తో చేసిన ‘జవాన్’ కూడా సూపర్ హిట్. ఇప్పుడు సల్మాన్‌ఖాన్, రణబీర్‌లతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడీ యంగ్ డైరెక్టర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.