జబర్దస్త్ కమెడియన్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. కొన్ని సినిమాల్లోనూ కమెడియన్ గా మెరిశాడు. అయితే వీటన్నిటినీ వదిలేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారం ప్రారంభించి అందరి నోళ్లలో నానాడీ జబర్దస్త్ కమెడియన్. మొదట కూకల్ పల్లిలో కర్రీ పాయింట్ చేసిన ఆర్పీ ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో పలు నగరాల్లో తన చేపల పులుసు బ్రాంచ్ లు ఓపెన్ చేశాడు. వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ కిర్రాక్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు చాలా కాస్ట్ లీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ. తన చేపల పులుసు తయారీలో క్వాలిటీకి చాలా ప్రాధాన్యమిస్తానని అందుకే రేట్లు ఎక్కువగా ఉంటాయంటూ వివరణ ఇచ్చాడు. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించాడీ జబర్దస్త్ కమెడియన్.
ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీ కర్రీ పాయింట్ లో చేపల పులుసు ధరలు మరీ అధికంగా ఉంటాయన్న ప్రశ్నకు స్పందిస్తూ .. కొందరు కావాలనే నా బిజినెస్ పై దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. నేను వండే చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. కొనగలిగే స్థోమత ఉన్నవాళ్లే తీసుకుంటారు. అలాగనీ తక్కువ రేటు అని చెప్పి.. ఎలా పడితే అలా ఇవ్వలేను కదా. మేం మొత్తం క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతాం. నా చేపల పులుసు మీకు అందుబాటు రేటులో ఉంటేనే తినండి. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నా బిజినెస్ పై అలాంటి ప్రచారం చేస్తున్నారు. రూ.100 జేబులో పెట్టుకుని.. రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నేను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను. ఎవరెన్నీ చేసినా నేను పట్టించుకోను’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు కిర్రాక్ ఆర్పీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..