
గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పైరసీ చేస్తూ నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రవి చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అలాగే పోలీసులు కూడా రిమాండ్ లో ఉన్న రవిని విచారణ చేస్తున్నాను. ఐబొమ్మ రవి అరెస్ట్ పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, సి. కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు రవి అరెస్ట్ పై స్పందించారు. పైరసీ కింగ్ ను అరెస్ట్ చేసినందుకు గానూ హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేసి పడేయాలి అంటూ ఆవేశంగా మాట్లాడారు. మరొకరు ఇలాంటి పనులకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా మండిపడ్డారు. అయితే సి. కల్యాణ్ వ్యాఖ్యలపై ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు రియాక్ట్ అయ్యారు. తన కుమారుడి గురించి మాట్లాడిన నిర్మాత తీరును తప్పపట్టారు.
నిర్మాత కళ్యాణ్ ను ఎన్ కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను ఒకప్పుడు 45 పైసలతో సినిమా చూశాను ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరిగాయి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు? నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేసి నా కొడుకుకి అండగా ఉంటాను’ అని అప్పారావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మరోవైపు ప్రముఖ నటుడు, నిర్మాత సీవీఎల్ నరసింహారావు ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న ఉద్యోగులు లేదా సినిమా టికెట్లు, స్నాక్స్ ఖర్చులు భరించలేని వారికి సినిమాలు అందుబాటులోకి తీసుకురావడం అనేది రవి ఒక పాజిటివ్ ఆటిట్యూడ్‌లో చేసినట్లు నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఐ-బొమ్మ రవి లాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను పోలీస్ డిపార్ట్‌మెంట్ లోకి రిక్రూట్ చేసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.