Sita Ramam Movie: మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నేరుగా తెలుగులో నటిస్తోన్న మొదటి చిత్రం సీతారామం (Sita Ramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్‌లైన్. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్లుగా కనిపించనున్నారు. అక్కినేని సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, తరుణ్‌భాస్కర్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫీల్‌గుడ్ సినిమాలతో ఆకట్టుకునే హను రాఘవవూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు (ఆగస్టు5) ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం (ఆగస్టు3) ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డార్లింగ్.
నాగ్ అశ్విన్ వద్ద వంద తీసుకున్నా..
‘మాకు సినిమా థియేటరే గుడి. ఆ గుడి కూడా ప్రేక్షకులు ఇచ్చిందే. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? ఈ సినిమా కూడా అంతే. ప్రతిభగల నటులు, అద్భుతమైన సాంకేతిక బృందం కలిసి చేసిన ఈ సినిమాని అందరం కలిసి థియేటర్లలోనే చూద్దాం. మన దేశంలో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో దుల్కర్ ఒకరు. ఆయన, మృణాల్‌ల అభినయం గురించి చెబుతుంటే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అన్న ఆసక్తి కలుగుతోంది’ అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. కాగా ఈవెంట్ చివర్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన సుమ రూ. 100 పెట్టి సీతారామం టికెట్ కొనుక్కోవాలని ప్రభాస్‌ను అడగింది. దీనికి బదులుగా ‘ నా జేబులో డబ్బులుండవు. ఇప్పుడే నాగ్ అశ్విన్ వద్ద అడిగి తీసుకున్నా’ అని అందరినీ నవ్వులు పూయించారు. ఆ తర్వాత నిర్మాత అశ్వినీదత్‌కు రూ. 100 ఇచ్చి సీతారామం టికెట్ కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..