Hero Nikhil : దేశంలో కరోనా విలయతాండవం చేస్తోందని.. దాన్ని అదిగమించాలంటే.. అందరూ ఒకరికొరు సాయం చేసుకోవాలని సినీనటుడు నిఖిల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎంతో మంది సాయం కోసం ఎదురుచేస్తున్నారని.. వీలైనంత వరకు ప్రతిఒక్కరూ చేతనైన సాయం చేయాలని ఆయన కోరారు. “బాధ, కోపం, చిరాకు, నిరాశతో ఈ వీడియో చేస్తున్నాను. కొవిడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి షూటింగ్స్ రద్దు చేసుకుని ఇంటికే పరిమితమయ్యాను. నాకు తెలిసిన స్నేహితులతో కలిసి ట్విటర్, ఇతర సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా సాయం కోరిన వారందరికీ సాయం అందిస్తున్నాను. మందులు, ఇంజెక్షన్స్, ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, ఐసీయూ వార్డులు.. ఇలా సాయం చేస్తూనే ఉన్నాను. కానీ అది సరిపోవడం లేదు.” అని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని… తెలిసిన బంధువులు, సాయం కోరిన కొంతమంది కళ్లముందే చనిపోవడం చూస్తుంటే బాధగా ఉందని నిఖిల్ చెప్పారు. మనల్ని ఎవరో వచ్చి కాపాడతారు అనుకుంటే అది జరగని పనని.. రాజకీయనాయకులు, ఇతర నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో ఎంతో బిజీగా ఉన్నారని.. ఆయన విమర్శించారు. “కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మాస్క్‌లు పెట్టుకోండి. శానిటైజర్లు వాడండి.” అని నిఖిల్ సూచించారు. అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. ప్రజలందరూ ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ముందుకు రావడం చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తోందని ఆయన అన్నారు. ఇక ఈ వీడియో ద్వారా తాను కోరేది ఒక్కటేనని.. అందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ కల్లోలం నుంచి సురక్షితంగా బయటపడదామని నిఖిల్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :