టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో శనివారం తెల్లవారు జాము ( సరిగ్గా 12 గంటల 31 నిమిషాలకు) నీలిమ రవి ప్రఖ్యాతో కలిసి నీలిమ ఏడడుగులు వేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లికి హాజరైన సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత అల్లు అరవింద్, బండ్ల గణేశ్ తదితరులు ఉన్నారు. అలాగే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నీలిమ-రవి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు విషెస్ చెబుతున్నారు. ఇక గుణశేఖర్ అల్లుడు విషయానికొస్తే.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, శ్రీ శక్తి అధినేత డాక్టర్ రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడే రవి ప్రఖ్యా. ఇతనికి కూడా పలు వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీరికి హైదరాబాద్‌లో పలు వ్యాపారాలతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయట
కాగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్‌తో బాలరామాయణం వంటి సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఆతర్వాత సొగసు చూడ తరమా, మనోహరం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణశేఖర్. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. సమంతతో ఆయన తెరకెక్కించిన పిరియాడికల్ సినిమా శాకుంతలం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నీలిమ విషయానికొస్తే.. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచింది. నిర్మాతగా మారింది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమ దేవికి చిత్రానికి ఆమె సహ నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం శాకుంతలం చిత్రానికి కూడా సహ నిర్మాతగా పనిచేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..