పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టరా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అందం, అమాయకత్వం.. అంతకు మించిన అల్లరితనంతో తెలుగు నాట ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ మూవీస్ లోనూ నటించి అక్కడి ఆడియెన్స్ ను మెప్పించింది. తన సహజ నటనతో మెప్పించిన ఈ అందాల తార సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇటీవలే ఓ మరాఠి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే గత 12 ఏళ్లుగా తెలుగు తెరపై ఈ బ్యూటీ కనిపించలేదు. అభిమానులందరూ ఆమె రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ తనెవరో గుర్తు పట్టారా? ఆ అమ్మాయి మరెవరో కాదు. హా..హ.. హ.. హసిని.. అలియాస్ జెనిలీయా డిసౌజా. సోమవారం (ఆగస్టు 05) జెన్నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సందర్భంలో జెనీలియా చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పై ఫొటో ఆ కోవకు చెందినదే.
1987 ఆగస్ట్ 5న ముంబైలో జన్మించిన జెనీలియా.. తుఝే మేరీ కసమ్ (నువ్వే కావాలి రీమేక్) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాలో నటించింది. ఎన్టీఆర్ సరసన సాంబ, నా అల్లుడు చిత్రాల్లో నటించింది. ఇక వెంకీ జోడిగా సుభాష్ చంద్రబోస్ మూవీలో నటించగా.. సై, హ్యాపీ, రామ్ సినిమాలలో నటించింది. అయితే సిద్దార్థ్ హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో ఆమె అల్లరి, అమాయకత్వం.. తింగరి పిల్లగా కనిపించి తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ఇక 2012లో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది జెనీలియా. ఇప్పుడీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇటీవలే తన భర్తతో కలిసి వేద్ (మజిలీ రీమేక్) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తెలుగులోనూ జెన్నీ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.