Tollywood: “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి” అనే పెళ్లి పాటను ఇచ్చింది ఈయనే..
తెలుగు సినిమా సంగీతానికి పితామహులలో ఒకరైన గాలి పెంచల నరసింహారావు జీవిత ప్రస్థానం విశేషమైనది. "శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి," "వివాహ భోజనంబు" వంటి అమర గీతాలను స్వరపరిచి, తరతరాలను అలరించిన ఆయన సినీ రంగ ప్రవేశం, ప్రముఖులతో అనుబంధం, సంగీత దర్శకత్వ శైలి, చివరి చిత్రం సీతారామకల్యాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయం గాలి పెంచల నరసింహారావు. శ్రీరామనవమితో పాటు, పెళ్లి వేడుకల్లో వినిపించే “శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి,” “వివాహ భోజనంబు” వంటి అమర గీతాలను స్వరపరిచి, తరతరాలను అలరించిన కీర్తి ఆయనది. ఒంగోలు దగ్గరున్న అమ్మనగ్రోలులో పుట్టన నరసింహారావు బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఎన్నో నాటక కంపెనీలలో హార్మోనిస్టుగా పనిచేశారు. 1934లో వెల్ పిక్చర్స్ నిర్మించిన సీతాకల్యాణం చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత, 1935లో వచ్చిన “శ్రీకృష్ణలీలలు” చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు బాల నటుడిగా పరిచయమయ్యారు. రాజేశ్వరరావు తన పాటలను నరసింహారావు అనుమతితో తనే స్వరపరుచుకున్నారు. 1936లో “శశిరేఖా పరిణయం” పేరుతో వచ్చిన తొలి “మాయాబజార్” చిత్రానికి నరసింహారావే స్వరకర్త. లాటిన్ అమెరికన్ ధోరణిలో సాగిన రెండు పాటల ప్రేరణతో ఈ చిత్రంలోని “వివాహ భోజనంబు” పాటను ఆయన స్వరపరిచారు. అయితే, ఎక్కడా ఆ ముద్ర కనపడకుండా అచ్చ తెలుగు బాణీయే అన్నట్లు ఆ పాటను తీర్చిదిద్దడం ఆయన గొప్పదనం.
1939లో వచ్చిన “మైరావణ” చిత్రానికి ఆయన స్వరపరిచిన పాటలు శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాహిని వారి “దేవత” చిత్రానికి సంగీత విభాగంలో నాగయ్యకు సహకారం అందించారు. ప్రారంభంలో “జీ. పెంచలయ్య” పేరుతో, ఆ తర్వాత పూర్తి పేరుతో గుర్తింపు పొందారు. 1943లో “పంతులమ్మ” చిత్రానికి ఎస్.బి. దినకర్ రావుతో కలిసి సంగీత దర్శకత్వం వహించి, గాయని జిక్కీతో “ఈ తీరున నన్నెరిగి పలుకగా” అనే ఆమె తొలి పాటను పాడించారు. నరసింహారావు సంగీత దర్శకత్వం వహించిన “కృష్ణప్రేమ”, “గరుడ గర్వభంగం” చిత్రాల్లో భానుమతి పాడిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. “కృష్ణప్రేమ” చిత్రంలో భానుమతి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి కలిసి పాటలు పాడటం చరిత్రలో నిలిచిపోయిన అంశం. ఆ తర్వాత, వీరు ముగ్గురు కలిసి నటించలేదు. 1945లో వచ్చిన “మాయాలోకం” చిత్రంలో “శ్రీ జానకీ దేవి సీమంతమునకు” పాటను సాంప్రదాయ పద్ధతిలో స్వరపరిచారు. పదేళ్ల తర్వాత వచ్చిన “మిస్సమ్మ” చిత్రంలోని సీమంత గీతం విన్నప్పుడు “మాయాలోకం” పాట గుర్తుకు వస్తుందని చెబుతుంటారు.
తన గురువు లాంటి నరసింహారావు బాణీని సంగీత దర్శకుడు రాజేశ్వరరావు అనుసరించారు. 1945లో “స్వర్గసీమ”తో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత, రాజేశ్వరరావు “పల్నాటి యుద్ధం” చిత్రానికి నరసింహారావు దగ్గర సహాయకుడిగా పనిచేశారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు తన పాటలు తనే పాడుకున్నారు. “యువకులంతా రారండి” అనే పాటను అక్కినేని పాడుతుంటే కోరస్ లో ఘంటసాల కూడా పాడటం విశేషం. ఈ చిత్రంలోని “తీరిపోయెనా మాత” అనే విషాద నేపథ్య గీతాన్ని ఘంటసాల ఆలపించారు. అలాగే అక్కినేని మరో చిత్రం “బాలరాజు”లో నరసింహారావుకు ఘంటసాల సంగీత పరంగా సహకారం అందించారు. 1949లో “ధర్మాంగద” చిత్రం ఫ్లాప్ అయినా, నరసింహారావు సంగీతానికి మంచి పేరు వచ్చింది. 1950లో “వాలి సుగ్రీవ” చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకులలో ఆయన ఒకరు. 1951లో “అగ్నిపరీక్ష” చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన తర్వాత పదేళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. 1961లో ఎన్టీఆర్ నరసింహారావును ప్రత్యేకంగా పిలిపించి “సీతారామకల్యాణం” చిత్రంలో అవకాశం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో తయారైన తొలి తెలుగు చిత్రం “సీతాకల్యాణం”తో మొదలైన నరసింహారావు కెరీర్, “సీతారామకల్యాణం” చిత్రంతో ముగిసింది. తన విద్యను ఎంతో మందికి నేర్పిన నరసింహారావు 1964 మే 25న తుదిశ్వాస విడిచారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
