
రాజస్థాన్‌లోని జైపూర్ నగరం అంటే హవా మహల్, అద్భుతమైన రాజభవనాలు, గులాబీ రంగు భవనాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ చారిత్రక నగరంలో మరో అరుదైన ఆకర్షణ కూడా ఉంది. హవా మహల్ సమీపంలోని ఓ ఫుట్‌పాత్‌పై 150 ఏళ్ల నాటి చెక్క కెమెరాతో ఇప్పటికీ ఫొటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ దేశ విదేశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ పురాతన కెమెరాతో ఫొటో దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆసక్తి చూపుతున్నారు. మూడు తరాలుగా కొనసాగుతున్న ఫోటోగ్రఫీ సంప్రదాయం..ఈ అరుదైన కెమెరా యజమాని టికమ్ చంద్ పహారీ. ఆయన కుటుంబం మూడు తరాలుగా ఫోటోగ్రఫీ వృత్తిని కొనసాగిస్తోంది. కార్ల్ జీస్ జెనా సంస్థ తయారు చేసిన ఈ పురాతన “మినిట్ కెమెరా” వారి కుటుంబ వారసత్వ సంపద. ఒకప్పుడు జైపూర్ మహారాజుకు అధికారిక ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన టికమ్ చంద్ తాత ఈ కెమెరాను ఉపయోగించేవారు. అనంతరం ఈ సంప్రదాయాన్ని టికమ్ చంద్ 1977 నుంచి కొనసాగిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
ఈ కెమెరాలో ఆధునిక కెమెరాల మాదిరిగా షట్టర్ బటన్ ఉండదు. లెన్స్ మూతను కొద్దిసేపు తొలగించి మళ్లీ అమర్చడం ద్వారా ఫొటోను బంధిస్తారు. అనంతరం కెమెరాలోనే ఏర్పాటు చేసిన చిన్న డార్క్‌రూమ్‌లో రసాయనాల సహాయంతో కేవలం పది నిమిషాల్లో నలుపు–తెలుపు చిత్రాన్ని సిద్ధం చేసి వినియోగదారులకు అందిస్తారు. ఈ ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించేందుకు ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు అక్కడికి చేరుకుంటున్నారు.
టికమ్ చంద్ కెమెరాతో ఫొటో దిగేందుకు సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపారు. అనిల్ కపూర్, జూహీ చావ్లా, గోవింద, అక్షయ్ కుమార్, ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, సోను నిగమ్, ఏపీ ధిలోన్, జాకిర్ ఖాన్, భువన్ బామ్ వంటి ప్రముఖులు ఈ చారిత్రక కెమెరాతో తమ జ్ఞాపక చిత్రాలను తీయించుకున్నారు. జైపూర్ రాజకుటుంబ సభ్యులు కూడా ఈ కెమెరాతో ఫొటోలు దిగడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
డిజిటల్ యుగంలో క్షణాల్లో ఫొటోలు తీసే సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ, జైపూర్‌లోని ఈ 150 ఏళ్ల నాటి కెమెరా పాతకాలపు ఫోటోగ్రఫీ సంప్రదాయాన్ని నేటికీ సజీవంగా నిలబెడుతోంది. హవా మహల్‌ను సందర్శించే ప్రతి పర్యాటకుడూ ఈ అరుదైన కెమెరాతో ఒక జ్ఞాపక చిత్రాన్ని దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పురాతన కెమెరా జైపూర్ నగరంలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..