AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dooradarshini Movie Review: ‘దూరదర్శిని’ సినిమా రివ్యూ.. 90స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది..?

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా పరిచయమైన చిత్రం 'దూరదర్శిని'. కార్తీకేయ బొమ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990ల నాటి పల్లెటూరి వాతావరణం, అప్పటి మనుషుల జీవనశైలి నేపథ్యంలో రూపొందింది. సుకుమార్ లాంటి దర్శకుల నుంచి మెప్పు పొందిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మరి ఈ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం..

Dooradarshini Movie Review: ‘దూరదర్శిని’ సినిమా రివ్యూ.. 90స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది..?
Dooradarshini Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 15, 2026 | 11:26 AM

Share

మూవీ రివ్యూ: దూరదర్శిని

నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్, జెమినీ సురేష్, భాస్కర్, విజయ్ కృష్ణారెడ్డి, లావణ్య రెడ్డి తదితరులు

ఎడిటింగ్: సన్నీ

సినిమాటోగ్రఫీ: సునీల్ పొన్నం

సంగీతం: ఆనంద్ గుర్రన

నిర్మాతలు: జయశంకర్ రెడ్డి ఎం, పాటిమిద్ది సంతోష్ కుమార్

దర్శకుడు: కార్తికేయ బొమ్మి

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా పరిచయమైన చిత్రం ‘దూరదర్శిని’. కార్తీకేయ బొమ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990ల నాటి పల్లెటూరి వాతావరణం, అప్పటి మనుషుల జీవనశైలి నేపథ్యంలో రూపొందింది. సుకుమార్ లాంటి దర్శకుల నుంచి మెప్పు పొందిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మరి ఈ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం..

కథ:

మట్టపరు అనే అందమైన పల్లెటూరులో జరిగే కథ ఇది. అక్కడ జనం కులమత భేదాలు లేకుండా ఎంతో ఆత్మీయంగా జీవిస్తుంటారు. ఆ ఊరిలోనే నివసించే హరి (సువీక్షిత్), వాణి (గీతిక రతన్)ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా వీరిద్దరి నేపథ్యాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వాణి ఒక మోతుబరి, పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి కాగా.. హరి ఒక నిరుపేద రైతు కొడుకు. పాత రోజుల్లో అందరూ ఒకే దగ్గర చేరి ‘దూరదర్శన్’ ఛానెల్‌లో వచ్చే ‘చిత్రలహరి’ చూస్తుంటారు. అలా టీవీ చూసే క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అయితే, వీరి బంధానికి వాణి అన్నయ్య పరశురామ్ (విజయ్‌ కృష్ణారెడ్డి) అడ్డుకట్ట వేస్తాడు. అతడిని ఎదిరించి ఈ జంట ఊరు విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత వారి ప్రయాణం ఏ తీరానికి చేరింది? వారి ప్రేమ కథ సుఖాంతమైందా లేదా విషాదంగా మిగిలిందా అన్నదే మిగతా కథ.

కథనం:

ఈ మధ్య ప్రస్తుతం నడుస్తున్న కథల కంటే ఎక్కువగా వింటేజ్ వైపు అడుగులు వేస్తున్నారు దర్శక నిర్మాతలు. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని 80, 90ల నాటి జ్ఞాపకాలను వెండితెరపై ఆవిష్కరించడం ఈమధ్యకాలంలో ఒక ట్రెండ్ గా మారింది. ఆ రోజుల్లో టీవీలు ఊరంతటికీ ఒకటో రెండో ఉండేవి. అందులోనూ కేవలం దూరదర్శన్ మాత్రమే వచ్చేది. బుధవారం ‘చిత్రహార్’, శుక్రవారం రాత్రి ఎనిమిదన్నరకు ‘చిత్రలహరి’ కోసం జనం కళ్లప్పగించి చూసేవారు. అయితే దర్శకుడు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు రోజూ చిత్రలహరి చూడటానికి కలుసుకున్నట్లు చూపించడం లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. కాకపోతే సినిమాలో లాజిక్స్ పక్కనబెట్టాలి అంతే. కథ పరంగా చూస్తే ఇది రొటీన్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ మూవీ భారతీరాజా గారి ‘సీతాకోక చిలుక’ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. స్నేహితుల బృందం హీరోకు అండగా నిలవడం, హీరోయిన్ అన్నయ్య విలనిజం పండించడం, నేటికీ సమాజంలో పట్టిపీడిస్తున్న కులాలు-అంతస్తులనేవి ప్రేమకు అడ్డుగోడలుగా మారడం వంటివన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసేవే. పతాక సన్నివేశాల్లో ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపిస్తూనే, చివరిలో దర్శకుడు ఇచ్చిన మలుపు ఆకట్టుకుంటుంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు, తల్లిదండ్రుల అనురాగానికి మించిన ఆస్తి లేదన్న ఒక మంచి సందేశాన్ని దర్శకుడు అంతర్లీనంగా ఇచ్చారు. అలాగే చదువు ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. మధ్యలో వచ్చే హాస్య సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. గోదావరి జిల్లాల పచ్చదనం, అప్పటి పల్లెటూరి ఇళ్లు, మనుషుల స్వచ్ఛమైన మనస్తత్వాన్ని తెరపై చాలా సహజంగా ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వింటేజ్ కథ చూడాలనుకునే వాళ్లకు దూరదర్శిని పర్లేదనిపిస్తుంది.

నటీనటులు:

తొలి సినిమా అయినప్పటికీ హీరో సువిక్షిత్ బొజ్జ, హీరోయిన్ గీతిక రతన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. మిలటరీ జవానుగా జెమినీ సురేష్, హీరో అన్నయ్య, తండ్రి పాత్రలు చేసిన నటులు, అలాగే హీరో స్నేహితుల గ్యాంగ్ పాత్రధారులందరూ తమ పరిధి మేరకు చాలా సహజమైన నటన కనబరిచారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సంగీతం ఓ మోస్తరుగా ఉంది. రెండు పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే, సినిమా నిడివి అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సింది. కెమెరా పనితనం అద్భుతంగా ఉంది, పల్లెటూరి అందాలను చక్కగా ఒడిసిపట్టింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఏ లోటూ లేకుండా ఉన్నాయి. దర్శకుడు కూడా మంచి కథ తీసుకున్నాడు.. వింటేజ్ ఫీల్ తెప్పించేలా కొన్ని సీన్స్ రాసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘దూరదర్శిని’.. 90స్ జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక పల్లెటూరి ప్రేమకథ..

Follow Us