
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన నటీమణులు ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో కార్తీక నాయర్ ఒకరు. అక్కినేని నాగచైతన్య హీరోగా అరంగేట్రం చేసిన సినిమా జోష్. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కార్తీక. విరబూసిన అరవిందాల్లాంటి కళ్లు.. చంద్రబింబం లాంటి మోముతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించి తెరకు దూరమయ్యింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?.. అలనాటి అందాల తార రాధ కూతురే కార్తీక. జోష్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ చిన్నది… ఆ తర్వాత తమిళంలో కో (తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యూత్ లో కార్తీకకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో వరుస అవకాశాలు అందుకుంది..
మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు, ఆఫర్లు రాలేదు. దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. అలా తెలుగులో ‘దమ్ము’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన బ్రదర్ బొమ్మాళి చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఈ భామ 2017లో ‘ఆరంభ్’ అనే హిందీ టీవీ సీరియల్‌లోనూ నటించింది.
ఆ తర్వాత కార్తీక పూర్తిగా సినిమాలకు.. సీరియల్లకు గుడ్ బై చెప్పేసింది. తన తల్లి రాధ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నట్లు కార్తీక స్టార్ డమ్ పొందలేకపోయింది. సినిమా ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె యూడీఎస్ హోటల్ గ్రూప్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.