
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇదే మూవీలో మహేశ్ స్నేహితుడు రవిగా ఓ కీలకమైన పాత్రలో నటించాడు అల్లరి నరేష్. అప్పటివరకు కామెడీ సినిమాలకే పరిమితమైన అల్లరి నరేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించాడు. స్నేహం అలాగే తనను నమ్ముకున్న వాళ్ల కోసం తన కెరీర్‌ని కూడా త్యాగం చేసే పాత్రలో అద్భుతంగా నటించాడు నరేష్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించాడు. అలా మహర్షి విజయంలో అల్లరోడి పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కామెడీ రోల్స్‌కు చిన్న గ్యాప్ ఇచ్చాడు నరేశ్.
నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి సీరియస్ రోల్స్‌తో ముందుకు సాగుతున్నాడు. అలా అల్లరోడి కెరీర్‌ని మహర్షి సినిమా మలుపు తిప్పిందని భావించవచ్చు. అయితే నిజానికి మహర్షి సినిమాలో అల్లరోడు పోషించిన పాత్ర ముందుగా ఓ మెగా హీరో వద్దకు వెళ్లిందట. అయితే అతను రిజెక్ట్ చేయడంతో అల్లరి నరేశ్ దగ్గరకు వచ్చిందట. ఇంతకీ రవి పాత్రను రిజెక్ట్ చేసిన ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్.
మహర్షి టైంలో సాయి ధరమ్ తేజ్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అలాంటి టైంలో మహర్షిలో రవి పాత్ర చేస్తే తేజ్‌కు మంచి బూస్టింగ్ వస్తుందని వంశీ పైడిపల్లి అనుకున్నాడట. అనుకున్నట్లు గానే సుప్రీం హీరోను సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల సాయి ధరమ్ తేజ్‌ను ఈ పాత్రను వద్దనుకున్నారట. ఆ తర్వాత లైన్‌లోకి అల్లరి నరేశ్ వచ్చాడు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లరి నరేష్ ఆల్కహాల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అటు తేజ్ కూడా సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి