
1993లో విడుదలైన వారసుడు చిత్రం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణల కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ, అనౌన్స్ అయినప్పటి నుంచీ విడుదలైన తర్వాత వరకు అనేక ఆసక్తికర విశేషాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 1993లో భారీ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిన్న, మీడియం హీరోలతో హిట్‌లు అందిస్తున్న ఈవివి, పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో, మురళి మోహన్ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నాగార్జునతో సినిమా చేయాలని కోరుకున్న ఈవివి, ఆయనకు సరిపోయే కాలేజీ బ్యాక్‌డ్రాప్ కథ సిద్ధం చేసుకున్నారు. కానీ నాగార్జున, ఆ కథ శివను పోలి ఉందని, వేరే కథ సిద్ధం చేయమని సూచించారు. అప్పుడు నిర్మాత మురళి మోహన్, నాగార్జునతో తొలిసారి సినిమా చేస్తున్నందున కొత్త కథ కాకుండా.. రీమేక్ సినిమా చేయమని సలహా ఇచ్చారట. అలా అజయ్ దేవగణ్ నటించిన హిందీ చిత్రం ఫూల్ ఔర్ కాంటే రీమేక్ ఆలోచన వచ్చిందట. రీమేక్‌లకు పెద్దగా ఇష్టపడని నాగార్జున, ఆ కథలోని తండ్రిని ద్వేషించే కాలేజీ స్టూడెంట్ పాత్రలోని ఎలివేషన్స్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
1992 ఆగస్టులో ఈవివి దర్శకత్వంలో నాగార్జున సినిమా వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే కొన్ని ఫ్లాపులు చవిచూసిన నాగార్జున, కామెడీ చిత్రాల దర్శకుడితో సినిమా చేయడంపై విమర్శలు వచ్చినా, ఆయన మాత్రం దర్శకుడి టాలెంట్‌ను నమ్మారు. హీరోయిన్‌గా నగ్మాను ఎంపిక చేయగా, బ్రహ్మానందం, బాబు మోహన్, తనికెళ్ళ భరణి వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రలు పోషించారు. సినిమాలోని హీరో తండ్రి ధర్మతేజ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదట ఈ పాత్రను మురళి మోహన్ స్వయంగా చేయాలనుకున్నా, సినిమాకు హైప్ కోసం కృష్ణ లేదా శోభన్ బాబులను సంప్రదించాలనుకున్నారు. శోభన్ బాబు అలాంటి పాత్రలు చేయనని చెప్పడంతో కృష్ణను ఒప్పించడానికి ప్రయత్నించారు. అప్పటికే కృష్ణ కెరీర్ స్లో అవ్వడంతో, తండ్రి పాత్ర చేయడం ద్వారా మరింత నెగటివిటీ వస్తుందని మొదట నిరాకరించారు. అన్నయ్య పాత్ర అయితే చేస్తానని, అది కూడా నాగార్జున సినిమా కాబట్టే అని చెప్పారట. కథలో మార్పులు చేయకుండా, విజయ్ కుమార్‌ను అడిగారు, కానీ ఆయనకు యాక్సిడెంట్ అవ్వడంతో చివరికి కొన్ని మార్పులతో మురళి మోహన్ ఒప్పించడంతో కృష్ణ ధర్మతేజ పాత్రను పోషించారట. తన అభిమాన హీరో కృష్ణ తన సినిమాలో నటించడం నాగార్జునకు చాలా ఆనందాన్ని ఇచ్చిందట.
ఎం.ఎం. కీరవాణి సంగీతం, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీతో 1992 అక్టోబర్ 6న పద్మాలయ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. కృష్ణ, నాగార్జున కాంబినేషన్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమా చివరి దశకు వచ్చేసరికి అభిమానుల మధ్య బ్యానర్లు, కటౌట్లు, దండల విషయంలో పోటీ ఏర్పడింది, ముఖ్యంగా తూర్పు గోదావరిలో ఈ పోటీ పతాక స్థాయికి చేరింది. ఎన్నో అంచనాల మధ్య 1993 మే 6న భారీ ఎత్తున వారసుడు విడుదలయ్యింది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున ఇంట్రో సీన్, బాబు మోహన్, బ్రహ్మానందంల కామెడీ, కృష్ణ ఇంట్రడక్షన్ అయిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఫైట్స్, క్లైమాక్స్ హైలైట్‌గా నిలిచాయి. నగ్మా గ్లామర్, కీరవాణి పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. నాగార్జున డ్రెస్సింగ్ స్టైల్ యువతను విశేషంగా ఆకర్షించింది. ధర్మతేజ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటన కనబరిచారు. అయితే, సినిమా విడుదలైన తర్వాత ఒక పెద్ద వివాదం చెలరేగింది. సినిమాలో నాగార్జున కృష్ణ కాలర్ పట్టుకోవడం, వాడు, వీడు అని సంబోధించడం కృష్ణ అభిమానులకు నచ్చలేదు. ఆగ్రహించిన అభిమానులు థియేటర్ల వద్ద బ్యానర్లు చించి, కటౌట్లకు నిప్పు పెట్టి, ధర్నాలు చేశారు. దీంతో నాలుగైదు రోజులు సినిమా కలెక్షన్లు పడిపోయాయి. పరిస్థితిని అదుపు చేయడానికి, కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి, క్లైమాక్స్‌లో కృష్ణతో ఫైట్ సన్నివేశాన్ని యాడ్ చేశారు. కృష్ణ, నాగార్జున, మురళి మోహన్, ఈవివి సత్యనారాయణ సమన్వయంతో ఉండాలని కోరుతూ పేపర్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటన తర్వాత కృష్ణ భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు చేయనని బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఇలా ఎన్నో విశేషాలు, వివాదాలతో వారసుడు అప్పట్లో వార్తల్లో నిలిచింది.