Suryakantham: హీరోయిన్ కావాలనే కల.. కానీ అవకాశం వచ్చినా తిరస్కరించిన సూర్యకాంతం.. ఎందుకో తెలుసా..

1924 అక్టోబర్ 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణ రాయపురంలో జన్మించారు సూర్యకాంతం. చిన్నతనంలోనే ఎంతో అల్లరి చేసేవారట. దాంతో అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాలేజీ చదువుల్లోనే హ్యాపీ క్లబ్ లో వేసేవారు.

Suryakantham: హీరోయిన్ కావాలనే కల.. కానీ అవకాశం వచ్చినా తిరస్కరించిన సూర్యకాంతం.. ఎందుకో తెలుసా..
Suryakantham
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 29, 2023 | 8:29 PM

తెలుగు సినిమాల్లో ఇప్పటికీ అత్త పాత్ర అంటే ఠక్కున గుర్తోచ్చే నటి సూర్యకాంతం. గయ్యాళి పాత్రలోల ఆమె తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించింది. అసలు వెండితెరకు గయ్యాళి అత్త పాత్రలను పరిచయం చేసిన విలక్షణ నటి సూర్యకాంతం. పాత్ర ఏదైనా సరే తన సహజమైన నటనతో ఆ పాత్రకు వన్నె తేవడమే కాదు.. ఆమె తప్ప మరో నటి ఆ పాత్రను చేయ్యలేరు అన్నంతగా ఇమిడిపోయేవారు. 1924 అక్టోబర్ 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణ రాయపురంలో జన్మించారు సూర్యకాంతం. చిన్నతనంలోనే ఎంతో అల్లరి చేసేవారట. దాంతో అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాలేజీ చదువుల్లోనే హ్యాపీ క్లబ్ లో వేసేవారు. ఆ సమయంలో ఆమెకు అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడడంతో సినీ రంగంపై మక్కువ కలిగింది. అలాగే ఆమెను అప్పుడు హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయట. దీంతో ముంబై వెళ్లాలనుకున్నారట.. కానీ ఆర్థిక స్థోమత లేక ఆ ఆలోచన విరమించుకున్నారట.

మొదటిసారిగా సూర్యకాంతం నారద నారది సినిమాలో సహాయ నటిగా కనిపించారు. ఆ తర్వాత గృహ ప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. అయితే సూర్యకాంతంకు హీరోయిన్ గా నటించాలనే కల ఉండేదట. ఆ అవకాశం కూడా తనను వెతుక్కుంటూ వచ్చింది. కానీ తన కల అయిన హీరోయిన్ అవకాశాన్ని వదులుకున్నారు. అందుకు ఓ కారణం కూడా ఉంది. సౌదామిని సినిమాలో కథానాయికగా సూర్యకాంతంకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆమె ఆ అవకాశాన్ని వదులుకున్నారట. గాయాలు మానిన తర్వాత 1950లో ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమాలో నటించారు. ఈ మూవీ సూర్యకాంతం కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ చిత్రం ఆమెను కయ్యాలమారిగా.. గయ్యాళి పాత్రలకు తగినట్లుగా చూపించింది. దీంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగిపోయాయి.

కేవలం ఆమె కోసమే క్యారెక్టర్స్ సృష్టించడం.. డైలాగులు రాయడం చేసేవారు అంటే ఆమె పాత్ర ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆమె పాత్ర పేరుతోనే గుండమ్మ కథ సినిమా తీశారంటే సూర్యకాంతం స్థాయి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 750పైగా సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయారు సూర్యకాంతం. ఆమె చివరగా నటించిన చిత్రం ఎస్పీ పరశురాం. 1994 డిసెంబర్ 18న 70 ఏళ్ల వయసులో స్వర్గస్తులయ్యారు సూర్యకాంతం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.