
తెలుగు సినిమా ప్రపంచంలో హీరోగా, విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు గోపిచంద్. వర్షం, నిజం వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించిన గోపిచంద్.. అదే సమయంలో హీరోగా యజ్ఞం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా హీరోగా గోపిచంద్ కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాలో సమీరా బెనర్జీ కథానాయికగా నటించగా.. అప్పట్లో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అమ్మాయి గుర్తుందా.. ? ఆమె పేరు జాహ్నవి. ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆమెకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్. మూగ అమ్మాయిల కనిపిస్తూనే తన కామెడీ మాటలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఈ సినిమాతో జాహ్వవికి మరింత గుర్తింపు వచ్చింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, జెనీలియా కలిసి నటించిన హ్యాపీ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది.
జాహ్నవి విషయానికి వస్తే.. యాంకర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. డాన్స్ బేబీ డాన్స్ అనే షోకు యాంకర్ గా చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ మీకు తెలుసా.. ? ఆమె భర్త ఫేమస్ సినిమాటోగ్రాఫర్. గాయం, చిత్రం, నువ్వు నేను, గులాబీ, కిక్ వంటి ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఆయన పేరు రసూల్ ఎల్లోర్. అలాగే ఒకరు, సంగమం, భగీరథ సినిమాలకు దర్శకత్వం వహించారు. సినిమాల్లో పనిచేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత జాహ్నవి సినిమాలు మానేయడం పై ఆమె భర్త సినిమాటోగ్రాఫర్ రసూల్ స్పందించారు.
ఒకరికి ఒకరు సినిమా సెట్ లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని అన్నారు రసూల్. జాహ్నవి పెళ్లి తర్వాత సినిమాలు మానేసిందని.. అందుకు పెద్దగా కారణాలంటూ ఏమి లేవని అన్నారు. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాకే తను సినిమాలకు దూరంగా ఉండిపోయిందని.. కానీ ఆమె అనుకుంటే మాత్రం మంచి దర్శకురాలు కాగలదని చెప్పారు. రసూల్ సినిమాటోగ్రాఫర్ గా .. ఫ్యామిలీ సర్కస్, లిటిల్ సోల్జర్స్, వాంటెడ్, జల్సా, ఊసరవెళ్లి, ఏజెంట్, దేవకీ నందన వాసుదేవ సినిమాలకు పనిచేశారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..