AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srihari: ఆడపిల్లలకు సమస్య… అన్నలా నిలబడ్డ శ్రీహరి.. ఈ విషయం తెలిస్తే ఆయన్ను దేవుడంటారు

శ్రీహరి గొప్ప నటుడని అందరికీ తెల్సు.. ఆయన అంతే మంచి వ్యక్తి కూడా. కష్టం అనే వస్తే చాలు.. వారు ఎవరనేది పట్టించుకోకుండా అడ్డంగా నిలబడతారు.

Srihari: ఆడపిల్లలకు సమస్య... అన్నలా నిలబడ్డ శ్రీహరి.. ఈ విషయం తెలిస్తే ఆయన్ను దేవుడంటారు
Director Bobby about Srihari
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2023 | 10:20 AM

Share

శ్రీహరి అర్ధాంతరంగా కాలం చేసిన అద్భుత నటుడు. నిజంగానే తక్కువ వయసులో ఈ లోకాన్ని వీడారు శ్రీహరి. ఆయన ఎంత గొప్ప నటుడో.. అంతకుమించి క్యారెక్టర్ ఉన్న మనిషి. పైకి కఠినంగా కనిపించినా.. కష్టం అనగానే కరిగిపోతాడు. సాయం అని వస్తే భుజం కాస్తాడు. అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చి… తిండి లేక పస్తులు ఉండే ఎందరికో ఆయన అన్నం పెట్టారు. ఎందరికో గుప్త దానాలు చేశారు. అయితే శ్రీహరిగారి మంచితనానికి సంబంధించిన ఈ ఘటన గురించి చెప్తే మాత్రం.. ఈయన దేవుడు అని మీరే అంటారు. ఆ విషయం కూడా మేము చెప్పేది కాదు. అప్పట్లో శ్రీహరి పక్కనే తిరిగిన డైరెక్టర్ బాబి చెప్పిన సంఘటన. ఆయన ప్రత్యక్షంగా చూసిన సంఘటన.

“ఒక్క ఇన్సిడెంట్‌లో శ్రీహరి గారి గురించి చెప్పాలంటే.. ఆయనకు 2 మొబైల్స్ ఉండేవి. ఒకటి పర్సనల్ నంబర్.. ఇంకోటి పబ్లిక్ నంబర్. ఇంటికొచ్చాక… ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి.. పర్సనల్ ఫోన్ పట్టించుకోరు. పబ్లిక్ నంబర్ మాత్రం ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతారు. ఒకరోజు అర్ధరాత్రి ఆయనకు ఓ  ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశారు. ఎవరో షిర్డి నుంచి హైదరాబాద్ బస్సులో వస్తున్న వ్యక్తి చేసిన కాల్ అది. అతనితో పాటు భార్య, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఏడుస్తూ అతను ఏదేదో మాట్లాడుతున్నాడు… అన్నా అది.. ఇది అని. ఏయ్.. ఎవడ్రా నువ్వు.. చెప్పుతో కొడతా.. ఏం కావాలి సరిగ్గా చెప్పు అని శ్రీహరి గారు గద్దించారు. అప్పుడు అతను చెప్పిన సమస్య ఏంటంటే.. షిర్డి నుంచి వస్తున్నప్పుడు.. బస్సులో మందు తాగిన గ్యాంగ్ కూర్చుని ఉంది. తన వైఫ్‌ను, పిల్లల్ని వాళ్లు కామెంట్ చేస్తుంటే.. అతను వాళ్లను తిట్టేశాడు. దీంతో ఆ గ్యాంగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అంతు చూస్తామని అతడికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో అతడికి అర్థం కాలేదు. ఎవరి వద్ద నుంచో తీసుకున్న శ్రీహరి గారి నంబర్ అతడి ఫోన్‌లో ఉంది. ఆయనకు ఫోన్ చేసి సమస్య చెప్పాడు. సర్లే అయితే. దేవుడి దగ్గరకు వెళ్లి వస్తున్నావు. గొడవ పడకు. మా వాళ్ల వస్తారులే అని చెప్పి ఫోన్ పెట్టేశారు శ్రీహరి గారు. తెల్లవారుజామున ఐదున్నరకు బస్సు ఎస్సార్ నగర్ వచ్చింది. ఆ బస్సులోని వ్యక్తి శ్రీహరి గారికి ఫోన్ చేసి.. ఎవరైనా వచ్చారా అన్న అని అడిగాడు. ముందు బస్సులో నుంచి బయటకు రమ్మన్నారు శ్రీహరి గారు. అక్కడ ఎండివర్ కార్‌లో.. టీ షర్ట్, లుంగీలో.. అప్పుడే నిద్రమత్తు కళ్లతో అక్కడ నిల్చున్నారు శ్రీహరి గారు. ఇది శ్రీహరి గారు అంటే” అని గతంలో భావోద్వేగంతో చెప్పుకొచ్చారు డైరెక్టర్ బాబీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.