Tollywood : సర్కార్‌తో సినీ చర్చలు.. భేటీ పై సర్వత్రా ఉత్కంఠ

|

Dec 26, 2024 | 8:28 AM

ఇన్ని రోజుల గ్యాప్‌, ఇన్ని రోజుల ఉత్కంఠ తర్వాత...తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎమ్‌ను కలుస్తున్న సినీ పెద్దల్లో దిల్‌రాజుతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఈ భేటీ...టాలీవుడ్‌కు గేమ్‌ ఛేంజర్‌ కానుందా? సినీ ఇండస్ట్రీ కష్టాలను తొలగించనుందా?

Tollywood : సర్కార్‌తో సినీ చర్చలు.. భేటీ పై సర్వత్రా ఉత్కంఠ
Tollywood And Cm Revanth Re
Follow us on

వేదిక…హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌. అటు సీఎం రేవంత్‌తో సహా సర్కార్ పెద్దలు. ఇటు దిల్‌రాజుతో సహా టాలీవుడ్‌ ప్రముఖులు. ఇరుపక్షాల మధ్య టేబుల్‌పై సత్సంబంధాలు, సహకారం అజెండా. సర్కార్ అండ్‌ సినిమా ఇండస్ట్రీ, మళ్లీ పాలునీళ్లలా కలిసిపోయేలా చూడడమే దిల్‌రాజు అండ్ టీమ్ కోరుకుంటోంది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ…ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్‌ టీమ్‌కి కెప్టెన్‌…తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు. దిల్‌రాజు టీమ్‌లో బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ ఉన్నారు. ఇక వాళ్లతో పాటు బిగ్‌ లీగ్‌ ప్రొడ్యూసర్స్‌ అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, మైత్రీ మూవీస్‌ నిర్మాతలు కూడా ఉన్నారు. వీళ్లతో పాటు 40 నుంచి 50 మంది సినీ ప్రముఖులు కూడా సీఎంను కలవనున్నారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్‌కి, టాలీవుడ్‌కి మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిని మరింత పెద్దవి చేశాయి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని, అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబడ్దార్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్‌ ప్రివిలేజెస్‌ ఉండవని చెప్పారు. స్పెషల్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి

సీఎం ప్రకటన నేపథ్యంలో.. సినిమా ఇండస్ట్రీకి సినిమా కష్టాలు మొదలయ్యాయి. సంక్రాంతికి క్యూ కట్టిన బడా సినిమాల నిర్మాతలకు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. సంక్రాంతి రేసులో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో వీటిని నిర్మించారు. ఆదాయపరంగా సంక్రాంతి సీజన్‌, అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా కీలకమే! ఇక ప్రేక్షకుల దృష్టిలో సంక్రాంతి అంటే సినిమా పండుగ ఇచ్చే బంపర్‌ ఆఫర్‌.

ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్‌కు టాలీవుడ్‌కి మధ్య పూర్తి స్థాయిలో వారధిగా మారిపోయారు దిల్‌రాజు. తాను అధికారంలో ఉన్నంతవరకు సినీ ఇండస్ట్రీకి స్పెషల్‌ ప్రివిలేజ్‌లు ఉండబోవని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ ప్రకటించిన నేపథ్యంలో… ఆయనను కన్విన్స్‌ చేయడానికి దిల్‌రాజు అండ్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. దిల్‌రాజు నేతృత్వంలో టాలీవుడ్‌ ప్రముఖులు… ముఖ్యమంత్రితో ఇవాళ భేటీ అవుతున్నారు. ఈ కీలక సమావేశం కోసం సినీ పెద్దలు ఓ అజెండాను రూపొందించారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య సమస్యలు లేకుండా, సత్సంబంధాలు ఉండేలా చూడడమే తమ అజెండా అంటున్నారు దిల్‌రాజు. దానికోసం ఎలా ముందుకు వెళ్లాలనేదానిపైనే సీఎంతో మీటింగ్‌ ఉంటుందని చెప్పారు FDC చైర్మన్‌. దిల్‌రాజు అండ్‌ టీమ్‌.. సీఎం రేవంత్‌ని కన్విన్స్‌ చేయగలుగుతారా.? సర్కార్‌తో సత్సంబంధాల విషయంలో.. టాలీవుడ్‌ని మళ్లీ ట్రాక్‌ మీదకు ఎక్కేలా చేయగలుగుతారా.? చూడాలి మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.