
ఇటీవల ప్రముఖ నిర్మాత, ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ కన్నుమూశారు. ఆయనను కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ ప్రముఖులు వచ్చారు. అందులో ఒక పెద్దావిడ కూడా ఉన్నారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఆటో దిగి వచ్చిన ఆమె శరవణన్ కు నివాళి అర్పించారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ తిరిగి మరో ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే.. ఆమె ఒకప్పుడు ప్రముఖ నటి. హీరోయిన్ గా, సహాయక నటిగా వందల సినిమాలు చేసింది. తన అభినయ ప్రతిభకు లెక్కలేనన్నీ అవార్డులు అందుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడారీ అందాల తార. లుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె వందల కోట్ల ఆస్తులు కూడ బెట్టారు. అయితే అవన్నీ త్రుణ ప్రాయంగా తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చేశారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆమెకున్న అచంచలమైన భక్తే ఇందుకు కారణం. ఆ స్వామి సేవ కోసమే ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?
1960, 70లలో టాప్ హీరోయిన్‌గా వెలుగొంది ఇప్పటికీ సినిమాల్లో మెరుస్తోన్న ఆ నటి పేరు కాంచన. నేటి తరానికి ఈ దిగ్గజ నటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ అమ్మమ్మ అంటే చాలా మంది గుర్తు పడతారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్ మూవీలోనూ కాంచన నటిస్తున్నారని సమాచారం.
Actress Kanchana
ఇదిలా ఉంటే కాంచన, ఆమె సోదరి గిరిజా పాండేలకు చెన్నైలోని టీ నగర్, జీఎన్ చెట్టి రోడ్డులో కోట్ల విలువైన స్థలం వారసత్వంగా వచ్చింది. అయితే కొందరు బంధువులు ఆ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో కాంచన కోర్టు మెట్లెక్కారు. తన వారసత్వ ఆస్తి కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి దక్కితే దేవుడికే ఇస్తానని మొక్కుకున్నారు. అంతే.. కోర్టులో గెలిచిన వెంటనే తన మాటను నిలబెట్టుకుంటూ ఆ స్థలాన్ని స్వామివారికి రాసిచ్చేశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఆలయ నిర్మాణం కోసం ఈ ఆస్తిని టీటీడీకి అప్పగించారు కాంచన. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ రూ. 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కాంచన.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.