Tollywood: కమెడియన్ లక్ష్మీపతి గుర్తున్నాడా.? చనిపోయే ముందు మూడు థియేటర్స్ అమ్మేశాడు.. చివరికి.!
కమెడియన్ లక్ష్మీపతి, దర్శకుడు శోభన్ ఇద్దరు అన్నదమ్ములని చాలామందికి తెలియదు. టాలీవుడ్ వెండితెరపై నవ్వులు పూయించిన లక్ష్మీపతి.. మరణం తర్వాత ఆయన కుటుంబం పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంది. ఆ విషయాలపై లక్ష్మీపతి కుమార్తె ఏం చెప్పిందో తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా..

కమెడియన్ లక్ష్మీపతి కూతురు శ్వేతా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి మరణం తర్వాత కుటుంబం ఎదుర్కున్న ఆర్ధిక సవాళ్లు, అలాగే సోదరులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సినీ అరంగేట్రం గురించి ఆమె పంచుకున్నారు. సంతోష్, సంగీత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మంచి విజయాలను అందుకున్నారని.. వారి ఎదుగుదల తనకు ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. అలాగే ఇంకో ఇద్దరు సోదరుల్లో ఒకరు విమానాశ్రయంలో పని చేస్తుండగా.. మరొకరు కో-డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నట్టు చెప్పింది. కుటుంబంలోని అందరూ వివిధ రంగాలలో స్థిరపడ్డారని పేర్కొంది.
తన తండ్రి లక్ష్మీపతి మరణించిన సమయంలో తాను రేడియో సిటీలో రూ. 15 వేలకు పని చేశానని.. అప్పుడు తన దగ్గర కేవలం రూ. 1,500 మాత్రమే ఉన్నాయని వివరించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రాగా, తిరిగి హైదరాబాద్ రావడానికి టికెట్‌కు ఎవరో డబ్బులు ఇచ్చారని తెలిపింది. తన తండ్రి మరణవార్త విజయవాడ బస్సులో న్యూస్ పేపర్ చదువుతుండగా తెలిసిందని చెప్పుకొచ్చింది. తన తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండేవని, తరచుగా జబ్బు పడేవారని తెలిపింది. అయితే మామయ్య శోభన్ మరణం తన తండ్రిని బాగా డిప్రెషన్‌కు గురి చేసిందని శ్వేతా పేర్కొంది. తన తండ్రి చాలా సున్నితమైన వ్యక్తి.. ఎక్కడా అప్పులు చేయలేదని.. తమకు రావాల్సినవి ఆస్తులే బంధువులు తీసేసుకున్నారని తెలిపింది. అలాగే తమ మూడు థియేటర్స్ కూడా అమ్మేసినట్టుగా చెప్పింది.
ప్రస్తుతం రైటర్‌గా ఎదుగుతున్న లక్ష్మీపతి కూతురు.. తన తండ్రి రాసిన కొన్ని కథలను ప్రచురించాలనే లక్ష్యంతో ఉంది. రేడియో జాకీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని.. టీవీ షోలకు దర్శకత్వం వహించినప్పటికీ.. సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో తన నవలలు ప్రచురణ జరగాలని.. తాను రాసిన రచనలు సినిమా కథలుగా మారాలని ఆశిస్తున్నట్టుగా తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
