
ఈ మధ్యన సినిమాలతో పాటు తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అలాగే రాబిన్ హుడ్ సినిమా ఈ వెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశిస్తూ రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవయ్యాయి. తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో కెక్కారు రాజేంద్ర ప్రసాద్. ఆదివారం (జూన్ 01) సాయంత్రం ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ అనుకోకుండా అలీని ఓ బూతుపదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని సరదాగా అన్నారు. అంతమంది నటీనటుల ముందు అలీని అలా బూతుపదంతో ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరలయ్యాయి. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు. తాజాగా ఇదే వివాదంపై అలీ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
‘ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఆయన సరదాగానే అన్నారు. కాని దీనిని తీసుకొని పెద్ద వ్యవహారం చేస్తున్నారు. అయన మంచి ఆర్టిస్ట్. కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన కూతురు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్లీ ఎవరూ కూడా రచ్చ చేయకండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదు’ అని అన్నారు.