Suchitra Sen : చిత్ర సీమకు ఆరాధ్య నటి సుచిత్రాసేన్ … క్లాసిక్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ మహానటి
మహానటి సుచిత్రా సేన్ గురించి ఈ తరం వారికి చాలా తక్కువగానే తెలిసి ఉంటుంది. ఆసలేమాత్రం తెలియకపోవచ్చు కూడా! మున్‌మున్ సేన్ తల్లి అంటేనో, రైమా సేన్-రియా సేన్ అమ్మమ్మ అంటేనో కొంచెం గుర్తుపడతారేమో! అది కూడా డౌటే!
మహానటి సుచిత్రా సేన్(Suchitra Sen) గురించి ఈ తరం వారికి చాలా తక్కువగానే తెలిసి ఉంటుంది. ఆసలేమాత్రం తెలియకపోవచ్చు కూడా! మున్‌మున్ సేన్ తల్లి అంటేనో, రైమా సేన్-రియా సేన్ అమ్మమ్మ అంటేనో కొంచెం గుర్తుపడతారేమో! అది కూడా డౌటే! ఆమెను మహానటి అని ఎందుకనాల్సి వచ్చిందంటే హిందీలో మీనా కుమారికి, తెలుగులో సావిత్రికి సుచిత్రా సేనే స్ఫూర్తి కాబట్టి. అపురూప సౌందర్యమూ, అద్భుతమైన అభినయమూ సుచిత్రా సేన్ సొంతం! దేశంలోని నటీనటులందరూ సుచిత్ర నటనకు జేజేలు పలికినవారే! ఆమె నటనలో పదో వంతు చేస్తే చాలనుకున్నవాళ్లే! బెంగాలీవాళ్లకైతే సుచిత్ర ఆరాధ్యనటి! మనకు ఎఎన్‌ఆర్-సావిత్రి జోడి ఎలాగో వారికి ఉత్తమ్‌కుమార్-సుచిత్రా సేన్ జంట అలాగ! సుచిత్రాసేన్- ఉత్తమ్‌కుమార్ కాంబినేషన్‌లో 30 సినిమాలు వచ్చాయి. వీటితో పాటు సుచిత్రాసేన్ మరో 30 సినిమాల్లో నటించిందంతే! బెంగాలీలో క్లాసిక్స్ అని చెప్పుకునే అనేకానేక సినిమాల్లో సుచిత్ర నటించారు. ఇవాళ ఆ మహానటి జయంతి. 1931లో సరిగా ఇదే రోజున సుచిత్ర జన్మించారు. ఆమె జన్మనామం రోమాదాస్ గుప్తా. సుచిత్ర తండ్రి కొరునమొయ్ దాస్‌గుప్తా స్కూల్ హెడ్‌మాస్టర్. తల్లి ఇందిరాదేవి గృహిణి. ప్రముఖ కవి రజనీకాంత్ సేన్ సుచిత్ర తాతగారు. 1952లో సుచిత్ర సినీరంగంలో అడుగుపెట్టారు. ఆమె మొదటి సినిమా శేష్ కొథాయ్. కాకపోతే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ మరుసటి ఏడాది నిర్మల్ దే తీసిన షరే చౌతూర్‌లో ఉత్తమ్‌కుమార్ సరసన నటించారు. ఆ సినిమా సూపర్‌డూపర్ హిట్టయింది. సుచిత్ర-ఉత్తమ్ జోడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరో రెండేళ్ల తర్వాత దేవదాసులో పార్వతి వేషం దొరికింది. పార్వతి పాత్రను సుచిత్ర తప్ప మరొకరు చేయలేరన్నది దర్శకశ్రేష్టుడు బిమల్‌రాయ్ గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని సుచిత్ర నిలబెట్టారు. దేవదాసు పాత్రను దిలీప్‌కుమార్ వేస్తే చంద్రముఖి పాత్రను వైజయంతిమాల వేశారు. పార్వతి పాత్రంలో సుచిత్రాసేన్ చక్కగా ఇమిడిపోయారు. ఏమాటకామాట చెప్పుకోవాలి.. మిగతా ఇద్దరు సుచిత్ర ముందు కాసింత తేలిపోయారు. ఈ సినిమా తర్వాత కూడా సుచిత్ర హిందీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపలేదు. బెంగాలీలైన హిందీ దర్శకులు బలవంతం చేస్తే కొన్ని సినిమాల్లో నటించారు. హృషికేశ్ ముఖర్జీ తీసిన ప్రయోగాత్మక చిత్రం ముసాఫిర్‌లో సుచిత్ర ఓ చిన్న పాత్ర వేశారు. ఓ ఇంట్లోని ఓ వాటాలో ఒకరి తర్వాత ఒకరు అద్దెకు దిగుతుంటారు. వారి కథల సమాహారమే ఈ సినిమా. మొదటి కథలో కొత్తగా పెళ్లయిన జంట ఆ వాటాలో దిగుతారు. అందులో అమ్మాయిగా సుచిత్ర నటించారు. బెంగాలీ దర్శకుడు, రచయిత అయిన రుత్విక్ ఘటక్ కూడా చిత్ర రచనలో సహకారం అందించారు. అదే సంవత్సరం ఫిల్మిస్తాన్ బ్యానర్‌లో భరత్ భూషణ్ హీరోగా వచ్చిన చంపాకలీలో నటించారు. ఇది కూడా బెంగాలీకి చెందిన ఎస్.ముఖర్జీ తీసిందే! మరో బెంగాలీ దర్శకుడు శంకర్ ముఖర్జీ తీసిన సర్‌హద్‌లో దేవానంద్‌తో జోడిగా నటించారు సుచిత్ర.
రాజ్‌ఖోస్లా డైరెక్షన్‌లో వచ్చిన బొంబాయి కా బాబూలో కూడా దేవానంద్‌తో కలిసి నటించారు. సినిమాలో ఈమెది ప్రధానపాత్రే కానీ దేవానంద్‌కు జోడి కాదు. ఆ మాటకొస్తే సుచిత్రను ఎంపిక చేయడం వెనుక దర్శకుడి ఉద్దేశం వేరు! సినిమాలో హీరో ఓ జూదరి. జులాయిగా తిరుగుతుంటాడు. ఒకానొక సందర్భంలో ఆవేశానికి లోనై ఓ వ్యక్తిని చంపేస్తాడు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెంది చనిపోయిన వ్యక్తి స్థానంలో ఓ గ్రామంలో ఉన్న వాళ్ల ఇంటికి వెళతాడు. ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయిన పిల్లోడే తిరిగి వచ్చాడని కుటుంబ సభ్యులు అనుకుంటారు. ఆనందపడతారు. ఆ వ్యక్తి చెల్లెలు పాత్రనే సుచిత్ర వేశారు. ఆ కుటుంబానికి అండదండగా ఉంటూ సుచిత్రను ప్రేమిస్తాడు. ఆమె మాత్రం తన అన్నయ్యే అనుకుంటుంది కాబట్టి అలాగే చూస్తుంది. హీరో ఎంతో మానసిక ఘర్షణకు గురవుతాడు. నిజం చెప్పలేడు. చెబితే ఏమవుతుందోనన్న భయం. చివరకు తన ప్రేమను చంపుకుంటాడు. సుచిత్రను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తను చేసిన నేరాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోతాడు. ఇదీ స్థూలంగా కథ. అప్పటికే దేవానంద్‌కు రొమాంటిక్ హీరో అన్న టాగ్‌లైన్ ఉంది. సుచిత్రను కాకుండా అప్పటి అగ్రతారలు ఆశాపరేఖ్, సాధన, వహీదాలలో ఎవరో ఒకరిని తీసుకోవచ్చు. చెల్లెలుగా చూపించి, ఆమెకు హీరోపై ప్రేమ కలగలేదని చూపిస్తే దేవానంద్ ఇమేజ్ దెబ్బతింటుంది. బాలీవుడ్‌లో అన్నా చెల్లెల్లుగా వేసిన వాళ్లను మరో చిత్రంలో ప్రేమికులుగా చూపించరు. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమోనన్న భయం. అందుకే సుచిత్రను ఎంపిక చేసి ఉంటారు..
1966లో బెంగాలీ డైరెక్టర్ అసిత్ సేన్ మమతా అనే హిందీ సినిమా తీశారు. ఇందులో హీరోయిన్ సుచిత్ర. 1963లో బెంగాలీలో వచ్చిన ఉత్తర ఫల్గుణి సినిమాకు ఇది రీమేక్. బెంగాల్‌లో డైరెక్ట్ చేసింది కూడా అసిత్ సేనే! ఇందులో సుచిత్రాసేన్‌ది డబుల్ రోల్. తల్లికూతుళ్లుగా నటించారు. తల్లి సుచిత్రకు జోడిగా అశోక్‌కుమార్ నటిస్తే, కూతురు సుచిత్రకు జంటగా ధర్మేంద్ర నటించారు. ఇది పెద్ద హిట్! పాటలు కూడా బాగా పాపులరయ్యాయి. మమతా అంత పెద్ద హిట్టయినప్పటికీ ఎందుకో సుచిత్ర హిందీ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపలేదు. ఒకానొక టైమ్‌లో రాజ్‌కపూర్ ఆఫర్‌ను కూడా సుచిత్ర తిరస్కరించారు. కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక సత్యజిత్ రే ఇచ్చిన ఆఫర్‌ను కూడా కాదన్నారు సుచిత్ర. హిందీ సినిమాలకు చాలా దూరంగా ఉన్న సుచిత్రకు ఆంధీ సినిమా ఆఫర్ వచ్చింది. ప్రముఖ రచయిత కమలేశ్వర్ రాసిన కాలీ ఆంధీ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు దర్శక రచయిత గుల్జార్. ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తీసిన సినిమా అని అప్పట్లో ప్రచారం జరిగింది. జన్‌సంఘ్ పార్టీ నాయకురాలైన మహారాణి గాయత్రీ దేవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నవల రాశానని కమలేశ్వర్ చెప్పుకున్నా జనం మాత్రం ఇందిరాగాంధీ స్టోరీనేనని నమ్మేశారు. నిజానికి ఇందిరాగాంధీ జీవితానికి ఆంధీ చిత్ర కథకు అసలేం మాత్రం సంబంధం ఉండదు. కాకపోతే సుచిత్ర రూపం ఇందిరాగాంధీని పోలి ఉంటుందంతే! ఈ సినిమా విడుదలయ్యే సమయానికి దేశంలో ఎమర్జెన్సీ ఉంది. ఉత్తరభారతంలో ఇందిరపై వ్యతిరేకత ఉండింది. చాలా చోట్ల ప్రజాందోళనలు జరుగుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్ల దగ్గరకు రప్పించడానికి ఇది ఇందిరాగాంధీ కథ అంటూ నిర్మాతలే చెప్పి ఉంటారేమో! అయినా ఇందిరాగాంధీ సినిమాను అడ్డుకోలేదు. చెన్నైలో మాత్రం ఇందిరాగాంధీ ఆన్ స్క్రీన్ అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్‌లు వెలిశారు. ఇది ఇందిరకు కోపం తెప్పించింది. వెంటనే సినిమాను నిషేధించారు. అప్పటికే సినిమా వచ్చి చాలా రోజులయ్యింది కాబట్టి నిర్మాతలకు బాగానే లాభాలొచ్చాయ. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత సినిమా మళ్లీ విడుదల చేశారు. 1980లో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ సినిమా జోలికి వెళ్లలేదు. ఈ సినిమా తర్వాత కూడా సుచిత్ర హిందీ సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు.
1978కి వచ్చేసరికి పూర్తిగా సినిమాల నుంచే నిష్క్రమించారు సుచిత్ర. నటించిది చాలనుకున్నారు. గ్లామర్ ప్రపంచం నుంచి పూర్తిగా వైదొలిగారు. చనిపోయేంత వరకు అజ్ఞాతంలోనే ఉండిపోయారు. చివరకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి అందుకోవడానికి కూడా వెళ్లలేదు. వస్తేనే అవార్డు ఇస్తామన్నారు. ఇవ్వకపోతే మానేయండి అని ఊరుకున్నారు సుచిత్ర. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు మమతా బెనర్జీ చేతుల మీదుగా ఏదో అవార్డు తీసుకున్నారు తప్ప.. ఏనాడూ పబ్లిక్‌లోకి రాలేదు. తెలుగులో వచ్చిన ఆరాధన (ఎఎన్‌ఆర్), మాంగల్యబలం, వివాహబంధం.. ఇలా చాలా సినిమాల మాతృకల్లో సుచిత్రనే కథానాయిక. సావిత్రి నటించిన చివరకు మిగిలేది సినిమా తెలుసుగా! దీనికి మూలం బెంగాలీలో వచ్చిన దీప్ జలీ జాయ్.. ఇందులో నటించింది సుచిత్రాసేనే! తెలుగులో ఆడలేదు. కానీ బెంగాల్‌లో పెద్ద హిట్.. బెంగాలీ సినిమాకు సంగీతాన్ని అందించిన హేమంత్‌కుమార్ చాలా కాలం తర్వాత హిందీలో ఖామోషీ పేరుతో రీమేక్ చేశారు. హిందీలో సుచిత్ర పాత్రను వహీదా రెహమాన్ వేశారు. 17 జనవరి, 2014లో తన 82 ఏట సుచిత్రా సేన్ కన్నుమూశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :