టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌డీసీ చైర్మన్ గా దిల్ రాజు నియామకం పట్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యుడు అక్కల సుధాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్ రాజును మర్యాదపూర్వకంగా ఆయన కలిసి హృదపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో చిత్ర పరిశ్రమ ఎదుగుదల, భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
సినిమాపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ఎఫ్‌డీసీ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. “దిల్ రాజు గారి అనుభవం, దృక్పథం నిస్సందేహంగా తెలంగాణ ఎఫ్‌డీసీని కొత్త శిఖరాలకు నడిపిస్తుంది” అని సుధాకర్ పేర్కొన్నారు. చలనచిత్ర రంగాన్ని అభివృద్ధిపర్చడంలో పరిశ్రమ ప్రముఖుల ప్రాముఖ్యతను చర్చించారు. ఈ సమావేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, స్థానికంగా ఉన్న టాలెంట్ ను ప్రోత్సహించడానికి, సినిమా నిర్మాణానికి తెలంగాణను ఒక ప్రధాన గమ్యస్థానంగా నిలబెట్టడానికి చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపైనా చర్చించారు.
దిల్ రాజు నాయకత్వంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. సినిమా నిర్మాతలకు అవకాశాలను సృష్టించడం అలాగే పరిశ్రమ నిపుణులకు మద్దతు ఇవ్వడంపై మళ్లీ దృష్టి పెడుతుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దిల్ రాజు బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్స్ ద్వారా టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడంలో ఆసక్తి కనబర్చే దిల్ రాజు నాయకత్వం పరిశ్రమలో అంతరాలను తగ్గించి, స్థిరమైన వృద్ధిని పెంపొందిస్తుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. దిల్ రాజు నియామకం.. చలనచిత్ర రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన అడుగు అని సినీరంగ ప్రముఖులు, నిపుణుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.