
టెలివిజన్ షోలలో తిరుగులేని రేటింగ్ సొంతం చేసుకున్న షో జబర్దస్త్.. ఈ కామెడీ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు హీరోలుగా, దర్శకులుగా, కమెడియన్స్ గా సినిమాల్లో రాణిస్తున్నారు. కాగా కొందరు జబర్దస్త్ లో చేసి ఆతర్వాత బయటకు వచ్చి షో మీద, మల్లెమాల ప్రొడక్షన్ పై విమర్శలు చేశారు. కాగా గతంలో జబర్దస్త్ పై విమర్శలు చేసిన వారి పై హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ గతంలో దీటుగా సమాధానమిచ్చారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన కొందరు కళాకారులు సంస్థపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో బాబు మోహన్ తన స్పందనను తెలియజేశారు. జబర్దస్త్‌లోకి అడుగు పెట్టకముందు అటువంటి కళాకారుల గుర్తింపు, వారి జీవనం ఎంత అనేది వారు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
జబర్దస్త్ కు రాకముందు నువ్వెంత..? నీ బ్రతుకెంత.? నీ జీవితమెంత.? అన్నది చూసుకోవాలి. చాలా మంది కేవలం పొట్టకూటి కోసం ఈ రంగంలోకి వచ్చి, ఇక్కడ గుర్తింపు పొందిన తర్వాత సంస్థను విమర్శించడం సంస్కారం కాదని బాబు మోహన్ పేర్కొన్నారు. మల్లెమాల సంస్థను చిత్రసీమకు ఒక తండ్రి వంటిదని బాబు మోహన్ అన్నారు. ఎం.ఎస్. రెడ్డి గారు, వారి పేరుతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నలుగురు కళాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించారని తెలిపారు. కమెడియన్లను తయారు చేసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాక్టరీలు లేదా ఇన్స్టిట్యూట్‌లు లేవని, అప్పట్లో రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావు వంటి దిగ్గజాలు నాటకాల ద్వారా వచ్చినవారేనని ఆయన గుర్తుచేశారు. అయితే, మల్లెమాల సంస్థ జబర్దస్త్ ద్వారా ఒకేసారి 40-50 మంది కమెడియన్లను తయారు చేసిందని, వారికి అన్నం పెట్టి పోషించిందని బాబు మోహన్ ప్రశంసించారు.
అన్నం పెట్టిన చేయిని కొరకడం సిగ్గులేని పని అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మల్లెమాల సంస్థ ఎంతో మందికి అన్నం పెడుతుందని, వేషాలు లేని వారికి, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా జబర్దస్త్ ఒక ఆసరాగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. నెలకు రెండుసార్లు కార్యక్రమం ఇస్తే వారి నెల గడిచిపోతున్న వారు చాలా మంది ఉన్నారని ఆయన వివరించారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం.ఆ అన్నం పెట్టిన వారిని గౌరవించాలి,” అని బాబు మోహన్ అన్నారు. మల్లెమాల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఒక సముద్రంలాంటి వారని, వారు ఎవరి సొమ్ము తినరని, నలుగురికి అన్నం పెట్టి మిగిలింది తింటారని ఆయన అన్నారు. తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఒక సాధారణ రెవెన్యూ శాఖ ఉద్యోగినని, మల్లెమాల, ఎం.ఎస్. రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గార్ల వల్లే తాను ఈరోజు స్టార్ నటుడిగా ఎదిగానని, ఏ దేశం వెళ్ళినా సన్మానాలు అందుకుంటున్నానని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను డబ్బులు వద్దన్నా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురు తనను బ్రతిమలాడి చెక్కులు ఇచ్చేవారని బాబు మోహన్ వెల్లడించారు. అటువంటి గొప్ప సంస్థ గురించి డబ్బులు ఇవ్వలేదని చెప్పేవారు మనుషులా, గాడిదలా, పశువులా అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. అటువంటి వారికి పుట్టగతులు ఉండవని బాబుమోహన్ హెచ్చరించారు.