AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 28: ఈ డేట్ అంటే తెలుగు ఇండస్ట్రీ పండగ రోజు.. అందరికీ ఎంతో మోజు..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏప్రిల్ 28వ తేదీకి ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. ఈ రోజున విడుదలైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన ‘అడవిరాముడు’తో మొదలై, ‘పోకిరి’, ‘బాహుబలి 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ల వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది, అయితే కొన్ని చిత్రాలకు మాత్రం ఇది కలిసిరాలేదు.

ఏప్రిల్ 28: ఈ డేట్ అంటే తెలుగు ఇండస్ట్రీ పండగ రోజు.. అందరికీ ఎంతో మోజు..
April 28th Movie Releases
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2026 | 3:49 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవ లేదు. టైటిల్ అక్షరం నుంచి విడుదల తేదీ వరకు, ప్రతిదానికీ ఒక నమ్మకం అల్లుకుని ఉంటుంది. అటువంటి సెంటిమెంట్లలో ఒకటి ఏప్రిల్ 28వ తేదీ. ఈ రోజున విడుదలయ్యే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తాయని సినీ వర్గాల్లో గట్టి నమ్మకం ఉంది. ఈ సెంటిమెంట్ ఏర్పడటానికి ప్రధాన కారణం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, దర్శకుడు కె. రాఘవేంద్రరావుల కలయికలో వచ్చిన అడవిరాముడు చిత్రం. 1977 ఏప్రిల్ 28న విడుదలైన అడవిరాముడు సంచలన విజయం సాధించి, అప్పటి రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలి సినిమాస్కోప్ ఈస్ట్ మన్ కలర్ చిత్రం. పాండవవనవాసం చిత్రంతో దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టిన రాఘవేంద్రరావుకు అడవిరాముడు అగ్ర దర్శకుడిగా నిలబెట్టింది. ఈ సినిమా జయప్రద, జయసుధలను స్టార్ హీరోయిన్‌లుగా నిలబెట్టగా, రచయిత జంధ్యాల, గీత రచయిత వేటూరి, డాన్స్ మాస్టర్ సలీం వంటి అనేకమందికి సక్సెస్ బాట వేసింది. నష్టాల్లో ఉన్న లక్ష్మి ఫిలిమ్స్ పంపిణీ సంస్థకు ఈ చిత్రం జాతకాన్ని మార్చింది. లవకుశ తర్వాత అత్యధిక కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ చిత్రం, విజయవాడ, కర్నూలు, వైజాగ్, హైదరాబాద్‌లలో 365 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. ఈ విజయం నుండే ఏప్రిల్ 28వ తేదీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఏర్పడింది.

అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో రెండు చిత్రాలు ఏప్రిల్ 28న విడుదలయ్యాయి. అవి అనార్కలి (1955), సెక్రటరీ (1976). అనార్కలిలో అంజలీదేవి టైటిల్ పాత్ర పోషించారు. తెలుగులో లైలామజ్ను, దేవదాసు, అనార్కలి వంటి విషాదాంత ప్రేమకథా చిత్రాల్లో అక్కినేని నటించి భగ్న ప్రేమికుడి పాత్రలకు తానే సాటి అనిపించుకున్నారు. సెక్రటరీ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న తొలి చిత్రం. డి. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి కేయస్ ప్రకాశ్ రావు దర్శకత్వం వహించారు. ప్రారంభంలో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, రిపీట్ రన్‌లో మంచి వసూళ్లు సాధించింది. అడవిరాముడు తర్వాత, సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించిన అడవి సింహాలు కూడా 1983 ఏప్రిల్ 28న విడుదలై ఘన విజయం సాధించింది. దీనికి కూడా రాఘవేంద్రరావే దర్శకుడు. అలాగే, కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన శుభసంకల్పం చిత్రం కూడా ఏప్రిల్ 28న విడుదలై, నిర్మాతగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత కె. విశ్వనాథ్ నటుడిగా బిజీ అయ్యారు.

2006 ఏప్రిల్ 28న విడుదలైన మహేష్ బాబు పోకిరి చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మేలి మలుపు. ఈ సినిమాకు ముందు ప్రిన్స్ అని పిలవబడిన మహేష్, పోకిరి తర్వాత సూపర్ స్టార్ అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ, మహేష్ నటన, ఇలియానా అందాలు, బ్రహ్మానందం, ఆలీ కామెడీ, మణిశర్మ సంగీతం సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో, ఆడే పండుగాడు అనే డైలాగ్ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. భారతీయ సినీ పరిశ్రమ స్థితిగతులను మార్చి, తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి 2 చిత్రం కూడా 2017 ఏప్రిల్ 28న విడుదలైంది.

అడవిరాముడు విడుదలైన సరిగ్గా 40 ఏళ్ళకు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పకుడిగా బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.2200 కోట్ల రూపాయలు వసూలు చేసి, ప్రాంతీయ సినిమా శక్తిని చాటిచెప్పింది. వీటితో పాటు, మురళీమోహన్ నటించిన బొమ్మరిల్లు (1978), ఆలీ హీరోగా నటించిన యమలీల (1994) వంటి చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్ 28న విడుదలై విజయాలు సాధించాయి. అయితే, ఈ సెంటిమెంట్ అందరికీ కలిసి రాలేదు. అక్కినేని మనవడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలై, భారీ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మొత్తానికి, ఏప్రిల్ 28వ తేదీ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణలకు విజయాలను అందించినప్పటికీ, అక్కినేని, ఆయన మనవడు అఖిల్‌కు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

Follow Us