ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాల టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆ తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. అలాగే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ఏప్రిల్ 8న జీవో నెంబర్ 35ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, ప్రొడ్యూసర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన తర్వాత.. జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు సింగిల్ బెంచ్ జడ్జి. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ యాజమానులకు వెసులుబాటు కల్పించింది కోర్టు. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని.. కానీ దీంతో సామాన్యులపై అధిక భారం పడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆ తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. ఇక అనంతరం రెండు వైపుల వాదనలు ఉన్న హైకోర్టు.. తీర్పుని రేపటికి వాయిదా వేసింది.
Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..