Ante Sundaraniki Review: సమ్మర్‌ ఎండింగ్‌లో సరదా సరదాగా… ‘అంటే సుందరానికీ’

| Edited By: Ram Naramaneni

Jun 10, 2022 | 5:31 PM

'అష్టాచమ్మా', 'అలా మొదలైంది' తరహా సినిమాలు నానికి ఎప్పుడూ కెరీర్‌ బెస్ట్ అయ్యే సినిమాలు. అలాంటి జోనర్‌ సినిమాలు నాని అభిమానులను ఎప్పుడూ నిరాశపరచవు.

Ante Sundaraniki Review: సమ్మర్‌ ఎండింగ్‌లో సరదా సరదాగా... అంటే సుందరానికీ
Nani
Follow us on

Ante Sundaraniki Movie Review: ‘అష్టాచమ్మా’, ‘అలా మొదలైంది’ తరహా సినిమాలు నానికి ఎప్పుడూ కెరీర్‌ బెస్ట్ అయ్యే సినిమాలు. అలాంటి జోనర్‌ సినిమాలు నాని అభిమానులను ఎప్పుడూ నిరాశపరచవు. ఒక రకంగా ఆ కైండాఫ్‌ ఫ్యామిలీ మూవీ ‘అంటే సుందరానికీ’. పక్కా నాని కైండ్‌ స్టోరీకి, వివేక్‌ ఆత్రేయ స్టోరీ నెరేషన్‌ స్టైల్‌ యాడ్‌ అయితే అది ‘అంటే సుందరానికీ’ అవుతుంది. రెయిజ్‌ మీదున్న నాని గ్రాఫ్‌, నజ్రియాకి తెలుగులో తొలి సినిమా, మొదటి నుంచీ అన్ని రకాలుగా అట్రాక్ట్ చేస్తున్న ప్రమోషనల్‌ స్ట్రాటజీస్‌ అన్నీ కలిపి సినిమా మీద హైప్‌ పెంచాయి. మరి థియేటర్లలో సినిమా చూసే జనాల్లోనూ అదే హై కనిపిస్తోందా? చదివేయండి…

సినిమా: అంటే సుందరానికీ

నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్

ఇవి కూడా చదవండి

నటీనటులు: నాని, నజ్రియా నజీమ్‌, అళగమ్‌ పెరుమాళ్‌, నదియా, నరేష్‌, రోషిణి, అనుపమ పరమేశ్వరన్‌, పృథ్విరాజ్‌,అరుణ భిక్షు, తన్వి రామ్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెంకటేష్‌ మహా తదితరులు

సంగీతం: వివేక్‌ సాగర్‌

సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి

ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల

రచన – దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ

నిర్మాత: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌

విడుదల: జూన్‌ 10, 2022

పక్కా మధ్యతరగతి బ్రాహ్మణ కుర్రాడు సుందరం (నాని). చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రస్‌ కాంపిటిషన్‌లో నాటకాలు వేస్తుండేవాడు. ఆ నాటకం చూసి ఒకతను (అలీ) సినిమా ఆఫర్‌ చేస్తాడు. అది కాస్తా చిరంజీవి సినిమా అని, అమెరికాలో షూటింగ్‌ అనీ అనుకుంటుంది సుందరం ఫ్యామిలీ. సముద్రాలు దాటి వెళ్లాలా వద్దా అని ఆలోచించి, చివరికి వెళ్లడానికే డిసైడ్‌ అవుతారు. అంతా సర్దుకున్న తర్వాత… తమకు సినిమా ఆఫర్‌ చేసిన వ్యక్తి ఫ్రాడ్‌ అని తెలుస్తుంది. అలా చేతిదాకా వచ్చిన సినిమా అవకాశం చేజారిపోయినా, అమెరికాకి వెళ్లాలన్న సుందరం కోరిక మాత్రం అలాగే ఉండిపోతుంది. పెరిగి పెద్దయిన తర్వాత, తను పనిచేస్తున్న కంపెనీలో సౌమ్య (అనుపమ పరమేశ్వరన్‌) ని బతిమలాడుకుని ఆమె ప్లేస్‌లో యుఎస్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తాడు సుందరం. నిజానికి అతను ఫారిన్‌ ఎందుకు వెళ్లాలనుకున్నాడు? అమెరికా వెళ్లాలనే చిన్నప్పటి కోరికను నెరవేర్చుకోవడానికేనా? ఇంకేమైనా అతని మనసులో అంతర్లీనంగా ఉందా? అనేది ఒక సస్పెన్స్. మరోవైపు నానికి చిన్నప్పటి నుంచి స్కూల్లో నచ్చిన లీల(నజ్రియా) ఏమైంది? ఆమె జీవితంలోకి వచ్చిన అబ్బాయిలతో ఆమెకి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లు ఉన్నాయి? లీలా, సుందరం ఒకరినొకరు ప్రేమించుకున్నారా? ప్రేమించుకుంటే, వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు ఎలాంటివి? ప్రేమ కోసం లీల ఇంట్లో చెప్పిన అబద్ధం ఏంటి? అది నిజమయ్యే పరిస్థితి వస్తే దాన్నుంచి ఆమె ఎలా బయటపడింది… వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

బ్రాహ్మణ కుర్రాడు, క్రైస్తవుల అమ్మాయి అనే సిల్వర్‌ స్క్రీన్‌ కాన్సెప్ట్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. నిన్నటి జనరేషన్‌కైతే సీతాకోక చిలుక సినిమా కన్నా ముందు నుంచే పరిచయం ఉన్నదే. అలాంటి కథను ఈ టైమ్‌కి తగ్గట్టు పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో రాసుకున్నారు వివేక్‌ ఆత్రేయ. చిన్న కాన్సెప్ట్, అందరికీ బాగా తెలిసిన విషయం… అయినా అందంగా చెప్పే ప్రయత్నం చేశారు. నాని.. ఆల్రెడీ ఉన్న ట్యాగ్‌ని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు…. నేచురల్‌గా నటించారు. ఆఫీస్‌ కొలీగ్స్ గా అనుపమ, హర్షవర్ధన్‌ యాక్టింగ్‌ బావుంది. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నదియా మెప్పించారు. లైఫ్లో అందరికన్నా డిఫరెంట్‌గా ఏదో సాధించాలన్న పట్టుదల ఉన్న అమ్మాయిగా నజ్రియా నటన మెప్పించింది. నాని తల్లిదండ్రుల పాత్రల్లో రోహిణి, నరేష్‌ పక్కాగా సరిపోయారు.

మనం చెప్పే అబద్ధాలు నిజమవుతాయా? నిజంగా తథాస్తు దేవతలు ఉంటారా? జీవితంలో నిజం చెప్పినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? పెద్దలు పెట్టిన ఆచారాలకు అర్థాలేంటి? వాటిని అనుమానించాలా? ఆచరించాలా? తనింట్లో ఇబ్బంది ఉన్నప్పుడు మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? అదే పొరుగింటికి ఆ ఇబ్బంది షిఫ్ట్ అయినప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి? లైఫ్‌లో ఎన్నో కోరికలుంటాయి… అవన్నీ నెరవేరుతాయని అనుకునే సమయంలో, అందరికీ చెప్పాక, అవి జరగకపోతే.. మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నిటినీ అయిన వాళ్లతో పంచుకునే అలవాటున్న కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి… ఒకటేంటి? ఇలాంటి ఎన్నో విషయాలను సెన్సిటివ్‌గా డీల్‌ చేశారు వివేక్‌ ఆత్రేయ. వివేక్‌ సాగర్‌ స్వరపరచిన బాణీలు ఒకటీ అరా మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉన్నాయి. మిగిలినవన్నీ సన్నివేశాలకు అనుగుణంగా సాగేవే. కానీ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బావుంది. డైరక్టర్‌ తీసిన సన్నివేశాల్లోని భావోద్వేగాలను ఎలివేట్‌ చేసింది.

కథ నిడివి పరంగా చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాలో హర్షవర్ధన్‌ కొన్నిచోట్ల చెప్పినట్టు…. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత చిన్న కథకి అంత సేపు కూర్చోపెట్టాలా? అని కొన్ని సందర్భాల్లో విసుగు కూడా వస్తుంది. కానీ అక్కడక్కడా వచ్చే సరదా సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో నటీనటుల పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్, సహజంగా సాగే డైలాగుల వల్ల ఆ విసుగు, బోర్‌ కంటిన్యూ కావు.
సరదాగా సినిమా చూడాలనుకునేవారికి అంటే సుందరానికీ నచ్చుతుంది.

– డా. చల్లా భాగ్యలక్ష్మి