నాంపల్లి కోర్టు, జులై 19: పరువునష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. చిరంజీవి బ్లడ్‌బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని జీవిత రాజశేఖర్ దంపతులు 2011లో ఆరోపణలు చేశారు.
ఇందుకుగానూ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరి ఆరోపణలకు సంబంధించి మీడియాలో ప్రచురితమై కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు.
దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం రాజశేఖర్, జీవితకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరు బెయిల్ బాండ్ల రూపంలో పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.