CM Revanth Reddy- Nagarjuna: సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన నాగార్జున దంపతులు.. ఎందుకంటే?
ప్రస్తుతం కూలీ, కుబేర సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న అక్కినేని నాగార్జున శనివారం (మే31) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. నాగార్జున వెంట ఆయన సతీమణి అమల కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా కలిశారు. నాగ్ తో పాటు ఆయన సతీమణి అమల సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున, రేవంత్ రెడ్డి చాలా సేపు ముచ్చటించుకున్నారు. అయితే ఈ భేటీ ముఖ్య ఉద్దేశమేమిటంటే.. త్వరలోనే నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం జరగనుంది. ఇంకా అధికారికంగా వివాహ తేదీ వెల్లడించనప్పటికీ జూన్ 6న ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అఖిల్ వివాహానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు నాగార్జున దంపతులు. ఇప్పుడు ఈ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది నవంబర్ 26న అక్కినేని అఖిల్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. జైనాబ్ రవ్డీతో కలిసి ఉంగరాలు మార్చుకున్నాడు. . అప్పటినుంచి వీరి పెళ్లి కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. . జూన్ 6న అఖిల్- జైనాబ్ ల వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుంది. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మెప్పించిన మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లెటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా మాస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్వరలోనే లెనిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.








