
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే నటన , డాన్స్ తో అదరగొట్టిన చరణ్, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో రామ్ చరణ్ పేరు మారుమ్రోగింది. ఆ తర్వాత చరణ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చరణ్ స్టార్ హీరోగా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మెగా పవర్ స్టార్ అనే బిరుదును సాధించాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ధ్రువ, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు చరణ్.
ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించి మెప్పించాడు. చరణ్ మేకోవర్, ఆయన నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక చరణ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలంతో పాటు సినిమా విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు చరణ్. తాజాగా చరణ్ ఇంస్టాగ్రామ్ లో మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
రాంచరణ్ ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 9 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని మరొక రికార్డు సృష్టించారు. నిజానికి సోషల్ మీడియాలోకి చరణ్ చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేసి. లేటుగా వచ్చిన లేటెస్ట్ రికార్డు నాదే అంటూ చాటి చెప్పారు. చరణ్ ఇలా సోషల్ మీడియాలో రికార్డు క్రియేట్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.