రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ఫొటో అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. వీడియో కాల్‌లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకొంటూ పలకరించుకున్నారు. ఆ తర్వాత తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా.. దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరూ బై చెప్పుకొన్నారు. 25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉన్నాయి. కొక్కేలకు దుస్తులూ వేలాడదీసి ఉన్నాయి.
దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో నిన్న బయటకు వచ్చింది. రౌడీషీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫొటో వైరల్‌గా మారడం నగర పోలీసులకు పెద్దతలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్‌కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్ విల్సన్‌గార్డన్ నాగ కూడా ఉన్నారు. మరోవైపు ఫొటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఇతర నిందితుల విచారణ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు.
ప్రియురాలిపై మోజుతో అభిమానిని హత్య చేసిన కేసులో దర్శన్‌తోపాటు.. అతని ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. రేణుకా స్వామి మర్డర్ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలను సేకరించారు బెంగళూరు పోలీసులు. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పెట్టాడని రేణుకస్వామిని కిడ్నాప్ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు. దర్శన్ ,పవిత్ర గౌడ అండ్ గ్యాంగ్ రేణుకాస్వామి చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. శవాన్ని కాలువలోపడేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దర్శన్‌కారును గుర్తించారు . బెల్టుతో కర్రలతో కొట్టడమే కాదు కరెంట్ షాక్ ఇచ్చారు నిందితులు . మర్డర్ స్పాట్‌లో ఆనవాళ్లను సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు పోలీసులు. ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ పోలీసుల దరికి చేరింది. రేణుకస్వామిని హత్య చేసిన షెడ్‌లో.. డెడ్‌బాడీని తరలించిన స్కార్పియో వెహికల్‌లో రక్త మరకలు, వేలిముద్రలపై క్లారిటీ వచ్చింది. ఓ పక్క కేసులో పక్కా ఆధారాలతో పోలీసులు ముందుకు వెళ్తుంటే.. జైల్లో దర్శన్ జల్సాలు చేస్తున్న వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.