పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సినిమాపై ఉన్న అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర క్రాఫ్ట్స్‌లోనూ పవన్ తనదైన ముద్ర వేశారు. స్క్రిప్ట్ రైటింగ్ మొదలు స్టంట్ కొరియోగ్రఫీ, సాంగ్ కొరియోగ్రఫీ, దర్శకత్వం చివరికి సింగర్‌గా కూడా తన ట్యాలెంట్‌ను చూపించారు. పలు సినిమాలకు స్క్రీన్‌ప్లే, కథ అందించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి కథ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పవన్‌కు గబ్బర్ సింగ్ వంటి భారీ విజయాన్ని అందించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. హరిహర వీరమల్లు సినిమా పూర్తికాగానే భవదీయుడు షూటింగ్ మొదలు కానుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు పవన్ కథను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కథా రచనలో పవన్ కూడా భాగమవుతున్నాడనేది సదరు వార్త సారంశం. ఇదిలా ఉంటే పవన్ సినిమాలకు కథ అందించడం ఇదే తొలిసారి కాదు గతంలో.. ‘జానీ’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలకు పవన్ కథ అందించగా, ‘గుడుంబా శంకర్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..