టాలీవుడ్ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం సోమవారం (జూన్ 5) ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివా బిదపాతో అభిషేక్ పెళ్లి జరిగింది. బెంగళూరులోని ఓ ప్యాలెస్‌లో ఒక్కలింగ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది.
ఈ పెళ్లి వేడుకకు పలువురు రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్, మోహన్‌బాబు, రాకింగ్ స్టార్ యాష్, సుహాసినీ మణిరత్నం, క్రికెటర్ అనిల్ కుంబ్లే తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అభిషేక్, అవివాల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జూన్ 7న జరగనుంది.
దాదాపు పది వేల మంది అతిథులు పెళ్లికి హాజరయ్యారు. ఎంపీ అయిన సుమలత ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు. కాగా నటి సుమలత తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నటుడు, రాజకీయవేత్త అయిన అంబరీశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అంబరీశ్ మరణం తర్వాత ఆమె మాండ్యా నుంచి పోటీచేసి, ఎంపీగా గెలుపొందారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.