ఏడేళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ జూన్‌లో పెళ్లి పీటలెక్కారు నయనతార- విఘ్నేశ్ శివన్. అతిరథ మహారథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా సరోగసీ పద్ధతిలో కవలలకు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్. అయితే వీరి ప్రేమకథకు పునాది ఎప్పుడు పడిందో తెలుసా? 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ నానుమ్ రౌడీ ధాన్ అనే సినిమాతో. ఈ సినిమాకు విఘ్నేశ్ శివనే దర్శకత్వం వహించారు. నయనతార- విజయ్ సేతుపతి జంటగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే నయన్, విఘ్నేశ్ తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఆతర్వాత అది ప్రేమగా చిగురించింది. అలా ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎట్టకేలకు ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
కాగా నానామ్ రౌడీధాన్ సినిమా తెలుగులో ‘నేనూ రౌడీనే’ పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ ప్రేమకథా చిత్రం విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు విఘ్నేశ్. అందులో విఘ్నేశ్, నయనతార ఎంతో సరదాగా నవ్వుతూ కనిపించారు. ఓ సముద్రం వద్ద వేసిన సెట్‌లో మొదట వారిద్దరూ ఏదో సీరియస్‌గా డిస్కస్ చేస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ నవ్వుతూ సంభాషించుకున్నారు. విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ ఒకప్పుడు పాండీవుడ్‌లో. నాకు జీవితంలో అన్నిటినీ ఇచ్చిన సినిమా. ఏడేళ్ల మధుర జ్ఞాపకం.. థ్యాంక్యూ ధనుష్ సార్’ అంటూ క్యా్ప్షన్ ఇచ్చాడు. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. కాగా ఈ సినిమా తర్వాతే వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రూమర్లు వచ్చాయి. ఆ తర్వాతి ఏడాది 2016లో జరిగిన సైమా వేడుకలో విఘ్నేష్ శివన్ తనకు అవార్డును అందజేయాలని నయన్ స్వయంగా కోరడంతో వీరి రిలేషన్‌షిప్‌పై మరిన్ని రూమర్లు మొదలయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..