
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను సృష్టించి మర్చిపోబడతాయి, కానీ మరికొన్ని సినిమాలు చరిత్రలో ఒక కళాఖండంగా నిలిచిపోతాయి. అటువంటి అద్భుత దృశ్య కావ్యం ‘బాజీరావు మస్తానీ’. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తవుతోంది. మరాఠా పీష్వా బాజీరావు బల్లాడ్, ఆయన రెండవ భార్య మస్తానీ మధ్య సాగిన అపురూప ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం, నేటికీ ప్రేక్షకులకు ఒక మధురమైన అనుభూతిని మిగిలిస్తోంది.
ఈ సినిమా వెనుక దాదాపు పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఉంది. 2003లోనే భన్సాలీ ఈ కథను అనుకున్నప్పటికీ, సరైన నటీనటుల కోసం వేచి చూసి చివరకు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలను ఎంచుకున్నారు. పదేళ్ల కిందట థియేటర్లలోకి వచ్చినప్పుడు, ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. భారీ సెట్లు, వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసిన యుద్ధ సన్నివేశాలు, మంత్రముగ్ధులను చేసే సంగీతం ప్రేక్షకులను 18వ శతాబ్దానికి తీసుకెళ్లాయి.
బాజీరావుగా రణవీర్ సింగ్ చూపిన పౌరుషం, ఆయన మరాఠీ యాస, డైలాగ్ డెలివరీ అద్భుతం. “చీతే కి చాల్, బాజ్ కీ నజర్..” అనే డైలాగ్ ఇప్పటికీ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉంది. మస్తానీగా దీపికా పదుకొణె కేవలం అందంతోనే కాదు, వీరనారిగా తన నటనతో మెప్పించింది. త్యాగానికి, ప్రేమకు నిలువుటద్దంగా నిలిచే ఈ పాత్ర ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమమైనది. కాశీబాయిగా ప్రియాంకా చోప్రా చూపిన హుందాతనం, ఎమోషన్స్ గుండెలను హత్తుకుంటాయి. ముఖ్యంగా మస్తానీతో తలపడే సన్నివేశాల్లో ఆమె నటన అద్వితీయం.
Bajirao Mastani
సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘దీవాని మస్తానీ’, ‘మల్హరి’, ‘పింగా’ వంటి పాటలు పదేళ్ల తర్వాత కూడా చార్ట్ బస్టర్స్ గానే ఉన్నాయి. ఆ కాలం నాటి శనివారవాడ కోటను తలపించే భారీ సెట్లు మరియు ఛాయాగ్రహణం ఒక విజువల్ వండర్‌గా నిలిచాయి. కేవలం వినోదమే కాకుండా, భారతీయ సంస్కృతిని, చరిత్రను ఇంత రిచ్‌గా చూపించిన సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.
నేడు పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నా, ‘బాజీరావు మస్తానీ’లోని ఆత్మ, కళాత్మకత ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. పదేళ్లు గడిచినా బాజీరావు పరాక్రమం, మస్తానీ ప్రేమ కథ వెండితెరపై సజీవంగానే ఉన్నాయి. సంజయ్ లీలా భన్సాలీ విజన్‌కు, నటీనటుల అంకితభావానికి ఈ పదేళ్ల యానివర్సరీ ఒక సెలబ్రేషన్ వంటిది.