టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో వెలుగులోకి సంచలనం.. అసలు టార్గెట్ ఎవరు..?
ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి, త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జుహులో జరిగిన ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సల్మాన్ ఖాన్‌తో సంబంధాల కారణంగానే టైగర్‌ను టార్గెట్ చేసినట్లు గ్యాంగ్ ఆరోపించింది. ఈ ఘటన బాలీవుడ్‌లో భయాందోళనలు సృష్టించింది, నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం జుహు ప్రాంతంలో జరిగిన ఈ దాడి నుంచి టైగర్ ష్రాఫ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేగింది.
ఫుట్‌బాల్ ఆడి వస్తుండగా మెరుపు దాడి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం దాదాపు 7:00 గంటల సమయంలో జుహులోని పుష్ప నర్సీ పార్క్ సమీపంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి టైగర్ ష్రాఫ్ తన బీఎండబ్ల్యూ (BMW) కారులో బయలుదేరుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారును లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆరో బుల్లెట్ టైగర్‌కు అతి సమీపంలోకి వచ్చి కాల్చే ప్రయత్నం చేయగా, తుపాకీ జామ్ కావడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఈ కాల్పుల తీవ్రతకు కారు అద్దాలు పగిలిపోయాయి. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఫిర్దౌస్ చేతికి బుల్లెట్ గాయమైంది. సమీపంలో ఉన్న మరో ఆటోరిక్షా డ్రైవర్‌కు కూడా తూటా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గన్‌పౌడర్, గాజు పెంకులు గుచ్చుకోవడంతో టైగర్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. అనంతరం టైగర్ ష్రాఫ్ పోలీసుల భద్రత నడుమ ఇంటికి చేరుకున్నారు.
సల్మాన్ ఖాన్‌తో సంబంధాలపైనే దాడి!
ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, హర్మన్ సంధు అనే వ్యక్తులు దీనికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్‌తో సంబంధాలు కొనసాగించినందుకే టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసినట్లు ఆ ఆడియోలో పేర్కొన్నారు. “గతంలోనే హెచ్చరించినా ఆయన మాట వినలేదు. అందుకే ఈ దాడి చేశాం. ఇండస్ట్రీలో ఎవరైనా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసినా లేదా మా ఆదేశాలు ధిక్కరించినా చంపేస్తాం. ఇదే మొదటి, చివరి హెచ్చరిక” అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్
ఘటన తెలిసిన వెంటనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే.. టైగర్ ష్రాఫ్ నివాసానికి చేరుకుని ఆయన్ను, ఆయన తల్లి ఆయేషా ష్రాఫ్‌ను పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. “ముంబైలో ఎవరి దాదాగిరినీ ఉపేక్షించేది లేదు. 1990ల నాటి గ్యాంగ్‌వార్ సంస్కృతిని నగరంలో మళ్లీ రానివ్వం. పౌరుల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు” అని షిండే హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి, నిందితులను తక్షణమే పట్టుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలీవుడ్‌లో భయాందోళనలు: ఏఐసీడబ్ల్యూఏ ఆందోళన
ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై నడిబొడ్డున సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. గతంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు, సైఫ్ అలీ ఖాన్, రోహిత్ శెట్టి, కపిల్ శర్మ కేఫ్‌పై దాడులను గుర్తుచేస్తూ.. సినీ ప్రముఖులను భయపెట్టి డబ్బులు గుంజడమే గ్యాంగ్‌స్టర్ల ప్రధాన ఉద్దేశమని ఆరోపించింది. సినీ ప్రముఖులకు పటిష్టమైన భద్రత కల్పించాలని మహారాష్ట్ర హోంమంత్రిని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
