Copy Allegations on Thaman: ‘అల’ వైకుంఠపురములో సక్సెస్‌తో ఈ ఏడాది హాట్ టాపిక్‌గా మారారు సంగీత దర్శకుడు థమన్. ఆ సినిమాకు గానూ థమన్ అందించిన సంగీతం అన్ని వర్గాలను తెగ ఆకట్టుకుంది. అంతేకాదు సినిమాకు మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. ఇక సినిమా విడుదలై దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్నా.. అందులోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో థమన్ డిమాండ్ మరింత పెరిగింది. ఆయనకు అవకాశాలు మళ్లీ క్యూ కట్టాయి. ఒకప్పుడు టాప్ హీరోలకు కాస్త దూరమైపోయిన థమన్, ఇప్పుడు మళ్లీ వారికి దగ్గరవుతున్నారు. ఇప్పుడు థమన్ లిస్ట్‌లో పవన్, మహేష్, విజయ్, పునీత్ రాజ్‌కుమార్ చిత్రాలు ఉన్నాయి. అయితే ‘వి’ విడుదల తరువాత థమన్ పరిస్థితి కాస్త అడ్డుతిరిగింది.
ఈ సినిమా విడుదల తరువాత థమన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. కాపీ చేసి మళ్లీ దొరికిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాట్చసన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అసురన్.. ఇలా పలు సినిమాల్లోని బ్యాక్‌గ్రౌండ్‌ని థమన్ ‘వి’ చిత్రానికి వాడారని నెటిజన్లు మీమ్స్ పెడుతున్నారు. అంతేకాదు గతంలో కాపీ మరక గురించి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలను పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు నెగిటివ్‌గా కామెంట్లు పెడుతున్న చాలా మందిని థమన్ బ్లాక్ కూడా చేశారు. అయితే ఈ సినిమాకు థమన్ పాటలను ఇవ్వలేదు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇచ్చారు. అయినా సినిమా కంటే, అందులోని పాత్రల కంటే, దర్శకుడి కంటే ఇప్పుడు థమన్ హాట్ టాపిక్‌గా అయ్యారు.
కాగా కాపీ చేసి దొరకడం థమన్‌కి ఇది మొదటిసారేం కాదు. గతంలోనూ హాలీవుడ్, బాలీవుడ్ సంగీతాన్ని కాపీ చేశారు. దీంతో అతడిపై కాపీ మరక పడింది. ఈ క్రమంలోనే టాప్ హీరోలు అతడికి దూరం అయ్యారు. అయితే తొలిప్రేమతో మళ్లీ దారిలోకి వచ్చిన థమన్, అల వైకుంఠపురములోతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూవీ తరువాత థమన్ సంగీతం అందించిన పలు చిత్రాల్లోని పాటలు ఇలా వచ్చి.. అలా పోయినప్పటికీ ‘అల’ బ్రాండ్ మాత్రం అలానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ‘వి’తో మరోసారి నెటిజన్లకు చిక్కి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. దీంతో కొంతమంది నెటిజన్లు ‘అలా’ వచ్చిన పేరును ‘వి’లా పోగొట్టుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విమర్శలకు థమన్ ఏమని సమాధానమిస్తారో చూడాలి.
Read More:
‘మెగాస్టార్’కి చిరంజీవి విషెస్
సర్‌ప్రైజ్‌లు ఉంటాయి: ‘రాధేశ్యామ్’ దర్శకుడి ఆసక్తికర ట్వీట్