
జబర్దస్త్ కామెడీ షో ఇప్పటికే ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇంకా ఇస్తూనే ఉంది. ఈ కామెడీ షో ద్వారానే చాలా మంది ట్యాలెంట్ బయటకు తెలిసింది. జబర్దస్త్ లో చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు వెండితెరపై రాణిస్తున్నారు. కొందరు హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తుంటే మరికొందరు నిర్మాతలుగా, డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వెంకీ మంకీ ఒకరు. ఇప్పటికీ ఈ కామెడీషోలో కొనసాగుతున్న ఈ కమెడియన్ అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. . మిమిక్రీ, వెంటలోగిజం ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు వెంకీ. ఎన్నో ఈవెంట్లలో తన మిమిక్రీ, కామెడీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక సాధారణ కంటెస్టెంటుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తన దైన కామెడీ టైమింగ్ తో.. పంచులతో చాలా తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కంటెస్టెంట్ గా స్టార్ట్ అయ్యి.. టీమ్ లీడర్ వరకూ ఎదిగాడు వెంకీ. వెంకీ మంకీ పేరుతో ఇతని టీమ్ చేసే స్కిట్లకు ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు.
ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లోనూ మెరుస్తోన్న వెంకీ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ మిమిక్రీ లో గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత వీడియో జాకీగా అవకాశం వచ్చింది. సింగరేణి తో పాటు కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ నేను వాటన్నింటిని వదులుకున్నాను. నాకు ప్రత్యేక గుర్తింపు ఉండాలనే నాకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులుకున్నాను. ఎందుకంటే మన గురించి తెలియవలసింది మన ఊర్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలియజేయాలని అనుకున్నాను. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు జబర్దస్త్ వెంకీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.