ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఫ్రెండ్స్ రూమ్ నుంచి బయటకు వచ్చిన కళ్యాణ్, అప్పూలు గుడిలోకి వెళ్లి ప్రసాదం తింటూ ఉంటారు. అప్పూ నవ్వుతూ ఉంటుంది. ఎందుకు బ్రో నవ్వుతున్నావ్? అని కళ్యాణ్ అంటే.. మా అమ్మ ఎప్పుడు పూజ చేసినా.. ప్రసాదం తినమంటే.. వద్దు అనేదాన్ని. కానీ ఇప్పుడు మనకు ఇదే దిక్కు అయ్యిందన్ని అంటుంది అప్పూ. నన్ను నమ్మి వస్తే నేను నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను. నీకేం బాధ లేదా? అని కళ్యాణ్ అడుగుతాడు. ఏందిరా భయ్ కోట్ల ఆస్తి నా కోసం వదలుకుని వచ్చావ్? మరి నేనేం అనుకోవాలి? నన్ను ప్రేమించినందుకు నీ బ్రతుకు ఇట్లా అయిందని బాధ పడాలా? అని అప్పూ అంటుంది. నిన్ను వదులు కోవడం కన్నా.. ఆస్తులు వదులు కోవడం కష్టమేమీ కాదని కళ్యాణ్ అంటాడు. నీ కోసం నేనే ఏదో ఒకటి చేయాలి. నీకు కష్టం రాకుండా చూసుకోవాలని అప్పూ అంటే. ఓయ్ నేను ఇప్పుడు నీ భర్తని అలా.. ఆలోచించాల్సింది నేను అని కళ్యాణ్ అంటే.. భర్తా కొత్తగా ఉందని అప్పూ నవ్వుతుంది.
గుడిలో దేవత ఉంది.. ఒక సరస్వతి పుత్రుడికి సహాయం చేస్తుందని అప్పూ అంటుంది. అప్పుడే కావ్య, బంటి వస్తారు. రా అక్కా ఇక్కడే లోపల ఉన్నారని బంటి చెప్తాడు. వాళ్లు ఏమన్నా బాధ పడుతున్నారా? అని కావ్య అంటే.. బాధా? వాళ్లు పిచ్చి పిచ్చి జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారని బంటి అంటుంది. రేయ్ బంటి నేను చెప్పినట్టు చేయి.. నీతో ఈ పని చేయిస్తున్నట్టు ఎవరికీ తెలీకూడదని కావ్య అంటుంది. సరే అక్కా అంతా నేను చూసుకుంటానని బంటీ చెప్పి.. గుడి లోపలికి వెళ్తాడు. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ.. అప్పూలు.. బంటీని చూసేటట్టు చేస్తాడు. బంటీని చూసిన అప్పూ రేయ్ అని పిలుస్తుంది. అక్కా మీరు ఇక్కడ ఉన్నారా? అని అంటాడు బంటి. ఎక్కడికి వెళ్లాలో తెలీక ఇక్కడికి వచ్చామని కళ్యాణ్ అంటాడు. అక్కా మీకు ఇల్లు లేదని నాకు చెప్పలేదా? ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోయావా? అని అంటాడు బంటి.
నువ్వు మాత్రం ఏం చేస్తావు రా అని అప్పూ అంటే.. నన్ను తక్కువ అంచానా వేయకు రా.. నా రూమ్ ఉంది కాదా.. రండి అని బంటి అంటాడు. నీకు ఇబ్బంది అవుతుందేమోనని కళ్యాణ్ అంటే.. నేనా.. ఉదయం అప్పూ వాళ్ల ఇంటికి వెళ్తే.. రాత్రి తిన్నాక రూమ్‌కి వస్తాను. ఇప్పుడు అప్పూ బదులు నేను అక్కడే ఉంటాను. రాత్రికి కూడా రాను అని బంటి అంటే.. సరే పదా అని అప్పూ, కళ్యాణ్‌లు వెళ్తారు. వాళ్లు ఒప్పుకోవడంతో కావ్య కూడా సంతోష పడుతుంది. ఆ తర్వాత కావ్య గుడిలోకి వస్తుంది. కళ్యాణ్‌ని ఇంటికి పిలవలేనందుకు చాలా బాధ పడ్డాను. కానీ ఇప్పటివరకూ నాలో ఉన్న ఈ అపరాధ భావం తొలగి పోయింది. నా చెల్లిని పెళ్లి చేసుకున్నందుకు కష్టాలు పడాల్సి వచ్చింది. నా మరిది గారు అనామికను పెళ్లి చేసుకుని.. వచ్చినప్పటి నుంచి ఆమె ఏ రోజూ భర్తగా గౌరవించ లేదు. ఏ పనీ చేయడానికి పనికి రాడని నిందించి.. అవమానించింది. అందుకే ఆయన ఇలా బయట ఉంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆ రోజు రావాలని.. నేను కఠినంగా ప్రవర్తించాను. కవి గారు జీవితంలో పైకి ఎదగాలని నా ఆశయం. నీ ఆశీస్సులు కూడా అండగా ఉండాలని దణ్ణం పెట్టుకుంటుంది కావ్య.
కట్ చేస్తే.. ధాన్య లక్ష్మి ఒంటరిగా నిల్చుని ఏడుస్తుంది. అప్పుడే మరో చిచ్చు పెట్టడానికి వస్తుంది రుద్రాణి. అంతలా అరిచావు? ఏం ప్రయోజనం ఉంది? అని అడిగితే.. ఇక్కడ ఎవరు నా బాధను అర్థం చేసుకుంటారు? ఏం చేసినా నా కొడుకు తిరిగి రాడు కదా? అని ధాన్య లక్ష్మి అంటుంది. నేను చెప్పేది కూడా అదే.. అరిస్తే గొడవ అవుతుంది కానీ.. వెళ్లి పోయిన కొడుకు ఎందుకు తిరిగి వస్తాడు? అని రుద్రాణి అంటే.. ఇంకేం చేయాలి? ఇష్టం లేని ఆ అప్పూని కోడలిగా ఒప్పుకోవాలంటే ఎలా? అని ధాన్య లక్ష్మి అంటే.. ఒప్పుకోమని ఎవరు చెప్పారు? ఒప్పుకున్నట్టు నటించమని రుద్రాణి అంటుంది. నటించడం నా వల్ల కాదని ధాన్య లక్ష్మి అంటే.. నీ కోపాన్ని పక్కన పెట్టి, నీ బుర్రకు పదును పెట్టు. అందరి ముందూ ఇద్దరూ కలిసి ఇంటికి రావడం నీకు ఇష్టమే అని చెప్పు. ఇంట్లో వాళ్లు అందరూ కలిసి ఏదో విధంగా కళ్యాణ్ వాళ్లను ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి అప్పూని బయటకు గెంటేయవచ్చు. నీకు తోడుగా నేను ఉన్నానని రుద్రాణి భరోసా ఇస్తుంది. రుద్రాణి మాటలు విన్న ధాన్య లక్ష్మి.. నువ్వు చెప్పింది నిజమే.. నువ్వు చెప్పినట్టే చేస్తానని అంటుంది.
ఆ తర్వాత రాహుల్ వస్తాడు. నువ్వు చెప్పింది ఏంటి? చేసేది ఏంటి? అని అడుగుతాడు. కళ్యాణ్ ఇంటికి తిరిగి రావడానికి ఆ కావ్య అస్సలు ఒప్పుకోదు. దీంతో కావ్య అందరి దృష్టిలో విలన్ అవుతుంది. అందరూ వ్యతిరేకంగా మారతారు. అది ఇంట్లోంచి వెళ్లిపోవడానికి వాళ్లే మార్గం చూపిస్తారని రుద్రాణి అంటుంది. ఇక అప్పూ, కళ్యాణ్‌లు కలిసి బంటి రూమ్‌కి వస్తారు. బంటి రూమ్ తాళం తీసే విధానం చూసి ఇద్దరూ షాక్ అవుతారు. అంతలోనే ఇంటి ఓనర్ వస్తాడు. ఎవరు వీళ్లు? అని అడుగుతాడు. మా అక్కా, బావ అని చెప్తాడు బంటి. నువ్వు ఒక్కడివే ఉంటావని అద్దెకు ఇచ్చాను. నీకు తోడుగా వీళ్లను తీసుకొచ్చావ్ ఏంటి? ఇంటి ఓనర్ అడిగితే.. ఇప్పటి నుంచి వీళ్లే ఉంటారు.. రెంట్ ఇంకో రెండు వందలు ఎక్కువ ఇస్తానని చెప్తాడు బంటి. నా ఇల్లు నువ్వు అద్దెకు ఇస్తావా? నేను ఒప్పుకోనని ఇంటి ఓనర్ అంటే.. ఇలా కాదు.. ఆంటీ అని బంటి అరుస్తాడు.
అప్పుడే ఇంటి ఓనర్ భార్య ప్రత్యక్షం అవుతుంది. ఏంటి బంటి పిలిచావు అని అడుగుతావు. వీళ్లు మా అక్కా, బావ. రాత్రే పెళ్లి అయింది. ఇక్కడికి తీసుకొచ్చాను. రెంట్ రెండు వందలు ఎక్కువ ఇస్తానని చెప్పాను. కానీ అంకుల్ ఊరుకోవడం లేదని అంటుంది. ఏంటి ఈ ఇల్లు ఏదో మీ అయ్య రాసినచ్చినట్టు ఓనర్ గిరి వెలగబెడుతున్నావ్? నేను ఇస్తాను అని ఓనర్ భార్య చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఇంటి ఓనర్ రూల్స్ చెప్తాడు. ఆ రూల్స్‌కి నిజంగానే నవ్వు తెప్పిస్తుంది.
ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్, అప్పూలను ఇంటికి తీసుకు రావడం నాకు ఇష్టమే అని ధాన్య లక్ష్మి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇది మీకు వచ్చిన నిర్ణయమేనా? సడెన్‌గా ఈ నిర్ణయం ఏంటి? ఇది మీరు తీసుకున్న నిర్ణయంలా లేదు. ప్రాణం పోయినా ఒప్పుకోను అన్న చిన్నఅత్తయ్య ఇంత సులభంగా ఎలా ఒప్పుకున్నారని స్వప్న, కావ్యలు అడుగుతారు. కావాలనే రాహుల్, రుద్రాణిలు చిచ్చు పెడతారు. సరే రాజ్.. వెళ్లి కళ్యాణ్ వాళ్లను తీసుకురమ్మని సుభాష్ అంటాడు. విన్నావుగా ఇప్పుడు ఏం అంటావ్? మీ పిన్ని ఎప్పటికీ ఒప్పుకోదు అన్నావుగా.. ఇప్పుడు తీసుకురమ్మని అంటుంది. ఇద్దరం కలిసి వెళ్లి తీసుకొద్దాం.. రా అని రాజ్ అంటే.. నేను రానని కావ్య అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. నువ్వే నా ఇలా మాట్లాడుతున్నావ్? అని ఇందిరా దేవి అడుగుతుంది. నా మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది. ఇది చిన్న అత్తయ్య నిర్ణయం. ఇందులో నేను జోక్యం చేసుకోలేనని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.