
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఐదో వారం ఎండింగ్ కు చేరుకుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. అలాగే కామనర్స్ కోటాలో అగ్ని పరీక్ష నుంచి దివ్య నికితా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ఆడియెన్స్ ను మరింత రంజింపజేసేందుకు మరి కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపనున్నాడు. ఈ ఆదివారం (అక్టోబర్ 12) ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస్ సాయి, సుహాసినీ, కావ్యశ్రీ, తనీశ్, అమర్ దీప్.. ఇలా వైర్డ్ కార్డ్ కంటెస్టెంట్ల జాబితాలో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు హౌస్ లోకి అడుగు పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీరితో పాటు ఒక కంటెస్టెంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో పలు సూపర్ హిట్ సీరియల్స్, టీవీ షోల్లోనూ మెరిసిన ఈ అందాల తారను పట్టు బట్టి మరీ హౌస్ లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
గతంలో ఈ ముద్దుగుమ్మ తమిళ బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొంది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గానూ నిలిచింది. ఒకానొక సమయంలో హోస్ట్ కమల్ హాసన్ నే ఎదిరించి మాట్లాడింది. ‘నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు’ అని లోక నాయకుడితో గట్టిగా మాట్లాడింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. తమిళ బిగ్‌బాస్ షోలో రెండు నెలల పాటు కొనసాగిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి కూడా రానుందని టాక్. ఆమె మరెవరో కాదు ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆయేషా జీనత్.
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసిన అయేషా తమిళ చిత్రం రాంబోలో హీరోయిన్ గా నటించింది. అయితే బిగ్ బాస్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక లవ్, డేటింగ్ వ్యవహారాల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి తమిళ బిగ్ బాస్ లో సత్తా చాటిన ఆయేషా తెలుగు బిగ్ బాస్ లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.