Superstar Krishna: ధృవతారకు కన్నీటి వీడ్కోలు.. మధ్యాహ్నం నుంచి సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం.. 

|

Nov 16, 2022 | 10:03 AM

Superstar Krishna: తెలుగు సినీ పరిశ్రమకు చుక్కానిగా నిలిచిన ఓ ధృవతార నేలరాలింది. తెలుగు సినీ జగత్తుకి దిశానిర్దేశం చేసిన సాహస నటుడికి యావత్‌ తెలుగు సమాజం గుండెలోతుల్లోంచి నివాళ్ళర్పిస్తోంది.

Superstar Krishna: ధృవతారకు కన్నీటి వీడ్కోలు.. మధ్యాహ్నం నుంచి సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం.. 
Superstar Krishna
Follow us on

తెలుగు సినీ పరిశ్రమకు చుక్కానిగా నిలిచిన ఓ ధృవతార నేలరాలింది. తెలుగు సినీ జగత్తుకి దిశానిర్దేశం చేసిన సాహస నటుడికి యావత్‌ తెలుగు సమాజం గుండెలోతుల్లోంచి నివాళులర్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి తమ అభిమాన నటుడి కడసారి చూపుకోసం తరలివస్తోంది అశేష ప్రజానీకం. సుదీర్ఘకాలంపాటు అవిశ్రాంతంగా తెలుగు చిత్రసీమ అభివృద్ధికోసం అహరహం పరిశ్రమించిన అలుపెరుగని నిత్య శ్రామికుడికి నివాళ్ళర్పించేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. యావత్‌ తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచేస్తూ.. నిన్న తెల్లవారు జామున ఆసుపత్రిలో ఆఖరి శ్వాసవీడిన వెండివెలుగు సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని పద్మాలయా స్టూడియోలో ఉంచారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు కృష్ణ అభిమానులు హైదరాబాద్‌కి పోటెత్తారు. రాత్రితెల్లవార్లూ కృష్ణ నివాసం ముందు అభిమానులు క్యూకట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌జగన్‌ సహా పలువురు సినీ ప్రముఖులు, భువి నుంచి దివికేగిన దిగ్గజ నటుడు కృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణ ఇంటికివచ్చి కృష్ణకు నివాళ్ళర్పించారు. కృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకోనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌ నుంచి అంత్యక్రియలు నిర్వహించే మహాప్రస్థానానికి తెలుగు సినీ తేజం సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ కృష్ణ అంతిమయాత్రకు సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్ర్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కెరటం కృష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తోంది. 12.30 గంటల తర్వాత అంతిమ యాత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమ కృష్ణకు ఘననివాళ్ళర్పిస్తోంది. తమ కుటుంబ సభ్యుడికి సంతాపసూచకంగా ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ బంద్‌ పాటిస్తోంది. ఇక ఏపీలో మార్నింగ్‌ షోలు రద్దు చేస్తున్నట్టు సినీ నిర్మాతలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

నింగికేగిన ధృవతార కృష్ణ మరణం కృష్ణ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. కృష్ణ కుమారుడు మహేశ్‌ బాబు తదితరులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నలుమూలల నుంచి తరలివస్తోన్న అశేష ప్రజానీకం తమ అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.